క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు

28 Jul, 2023 15:56 IST|Sakshi

దారుణ పరిస్థితుల్లో శవమై తేలినఫెర్నాండో పెరెజ్ అల్గాబా

Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్‌ప్లూయెన్సర్‌ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా  (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు  తప్పిపోయిన  ఫెర్నాండో  శవమై కనిపించాడు.  అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్‌ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను  పోలీసులు కనుగొన్నారు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్‌కేస్‌లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్‌కేస్‌ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.  సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా  సూట్‌కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది.  

చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అతని బాడీ మీద ఉన్న  వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.

తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక  ఒక ప్రొఫెషనల్  నేరగాడి పని అని ఉంటుందని  అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు  కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు.

కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా  భారీ సంపదను ఆర్జించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మిలియన్  ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్‌ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు  కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి  కనిపించకుండా పోయాడు.

మరిన్ని వార్తలు