జాబ్‌ కోసం సైకిల్‌ తొక్కుతున్న ఇంజినీర్లు!

29 Oct, 2023 21:12 IST|Sakshi

ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్‌ మరే ఉద్యగానికి ఉండదు. చిన్న ఉద్యోగమైనా చాలు లైఫ్‌ సెటిల్‌ అవుతుందని యువత భావిస్తుంటారు. అయితే కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు చాలా కిందిస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. కేరళలో ప్రభుత్వ కార్యాలయాలలో ప్యూన్ ఉద్యోగానికి అవసరమైన అర్హత 7వ తరగతి ఉత్తీర్ణత. దీంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

(టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) 

ప్యూన్‌ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండకూడదని నిబంధన ఉన్ననప్పటికీ చాలా మంది బీటెక్‌ గ్రాడ్యుయేట్లు, ఇతర డిగ్రీ ఉత్తీర్ణులు ఏటా దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సైకిల్ పరీక్ష కోసం వరుసలో ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఆ రాష్ట్రంలోని వివిధ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో డిగ్రీలు ఉన్న యువకులు సైకిల్‌తో వచ్చి తమ వంతు కోసం వేచి ఉంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఉద్యోగ భద్రతే కారణం
ప్రైవేటు ఉద్యోగాలంటే ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియదు. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే భద్రత ఉంటుందని యువత భావిస్తున్నారు. దీంతో కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దశాబ్దాలుగా అధిక డిమాండ్ ఉంది. అంతేకాకుండా పెళ్లిళ్ల విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఉండటం మరో కారణం.  

ప్యూన్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ జీతం దాదాపు రూ. 23వేలు ఉంటుంది. దరఖాస్తుల్లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను అక్టోబర్ 26, 27 తేదీల్లో సైక్లింగ్ పరీక్షకు పిలిచారు. గతంలో ఆఫీసు అసిస్టెంట్లు విధుల్లో భాగంగా సైకిళ్లపైనే వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడా అవసరం లేకపోయినప్పటికీ, ప్యూన్ పోస్టుల కోసం ఇప్పటికీ సైక్లింగ్ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. 

ఈ పోస్టులకు అభ్యుర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఎటాంటి డిగ్రీ లేదని డిక్లరేషన్‌ సమర్పించాల్సి ఉంటుందని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయ అధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. డిగ్రీ లేని వ్యక్తులు కేరళ రాష్ట్రంలో అరుదుగా కనిపిస్తారని చెప్పారు. సైక్లింగ్ పరీక్ష పూర్తయిన తర్వాత, ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌  ఉంటుంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగార్థులు ఉండే రాష్ట్రాల్లో కేరళ ఒకటి.

మరిన్ని వార్తలు