Deepinder Goyal: అలా కనిపిస్తాయంతే.. డిస్కౌంట్లపై జొమాటో సీఈవో నిజాయితీ కామెంట్‌

4 Nov, 2023 20:04 IST|Sakshi

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో మనం తరచూ 50 శాతం.. 60 శాతం అంటూ కొన్ని డిస్కౌంట్‌ ఆఫర్లను చూస్తుంటాం. అయితే ఆ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal). 

యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్‌కాస్ట్ 'ది రణవీర్ షో'లో చర్చ సందర్భంగా, జొమాటో తన కస్టమర్‌లకు అంతంత తగ్గింపులను ఎలా అందించగలదని గోయల్‌ను ప్రశ్నించారు. దీనికాయన సమాధానమిస్తూ.. "ఆ డిస్కౌంట్‌లు అంత పెద్దవేమీ కావు, అలా  కనిపిస్తాయంతే" అని నిష్కపటంగా వ్యాఖ్యానించారు.

జొమాటో తరచుగా "రూ. 80 వరకు 50% తగ్గింపు" వంటి ఆఫర్‌లను అందజేస్తుందని, వాస్తవానికి ఇక్కడ లభించే డిస్కౌంట్‌ రూ. 80 మాత్రమేనని, పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు అని దీపిందర్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఉదాహరణకు గోయల్ లెక్కల ప్రకారం.. ఆర్డర్ మొత్తం రూ. 400 అయితే దానిపై లభించే డిస్కౌంట్‌ రూ.80 అంటే తగ్గింపు 20 శాతం మాత్రమే.

అందులో నిజాయితీ లేదు
ఈ డిస్కౌంట్‌ పద్ధతి కస్టమర్‌లను తప్పుదారి పట్టించవచ్చని గోయల్ అంగీకరించారు. దాన్ని మార్చాలని తనకు ఉన్నప్పటికీ, పోటీదారులు ఈ అతిశయోక్తి తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తున్నప్పుడు జొమాటో మాత్రమే దీన్ని మార్చడం కష్టమన్నారు. ‘నేను ఈ రకమైన డిస్కౌంట్లను నిజాయితీగా పరిగణించను. డిస్కౌంట్‌లు సూటిగా, నిజాయితీగా ఉండాలి. మీరు మీ కస్టమర్‌కు తగ్గింపును వాగ్దానం చేస్తే, అది స్పష్టంగా ఉండాలి’ అని గోయల్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 

ఇక వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీతో తన స్నేహపూర్వక సంబంధం గురించి గోయల్ పంచుకున్నారు. తాము కలిసినప్పుడు వ్యాపార విషయాలను మాట్లాడుకోమని వివరించారు.
ఇదీ చదవండి: షాపింగ్‌ చేస్తున్నారా? బెస్ట్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లున్న క్రెడిట్‌కార్డులు ఇవే..

మరిన్ని వార్తలు