ఇక స్టాక్ మార్కెట్ల దారెటు?

7 Nov, 2020 13:14 IST|Sakshi

శనివారం సాయంత్రం 6-7 మధ్య మూరత్ ట్రేడింగ్

అమెరికా ఎన్నికల ఫలితాలు, గణాంకాల ఎఫెక్ట్

నిఫ్టీకి 12,400 వద్ద రెసిస్టెన్స్- 11,800 వద్ద సపోర్ట్

మార్కెట్లకు ఎఫ్ఐఐల పెట్టుబడుల మద్దతు

 గత వారం 5.5 శాతం ఎగసిన సెన్సెక్స్, నిఫ్టీ

42,000 సమీపానికి సెన్సెక్స్ -12,000 ఎగువన నిఫ్టీ

ముంబై: దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు శనివారం(14న) సాయంత్రం 6.15-7.15 మధ్య ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. పలు సానుకూల వార్తల నేపథ్యంలో గత వారం(2-6) అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ దూకుడు చూపాయి. అయితే ఇకపై మార్కెట్ల ట్రెండును ప్రధానంగా విదేశీ సంకేతాలు ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తాజాగా అమెరికా ప్రెసిడెంట్ రేసులో విజయానికి చేరువలో నిలిచారు. దీంతో ఎన్నికల ఫలితాలలో స్పష్టత ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బలాన్నివ్వగలదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఫలితాలు, మార్కెట్ల భారీ ర్యాలీ.. వంటి అంశాలతో వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

దేశీ గణాంకాలు
అక్టోబర్ నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు, సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు 12న విడుదల కానున్నాయి. ఈ బాటలో చైనా, అమెరికా ద్రవ్యోల్బణ వివరాలు, యూరో ప్రాంత పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం 10, 12 మధ్య వెల్లడికానున్నాయి. కాగా.. దేశీయంగా ఇప్పటికే క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపునకు వచ్చింది. ఈ నెల 11న క్యూ2 ఫలితాలను ప్రకటించనున్న కంపెనీల జాబితాలో అరబిందో ఫార్మా, శ్రీ సిమెంట్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ చేరాయి. ఈ బాటలో ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 12న, చమురు దిగ్గజం ఓఎన్జీసీ 13న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి.

ఇతర అంశాలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి పలు అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. ఈ నెలలో ఇప్పటివరకూ నగదు విభాగంలో ఎఫ్ఐఐలు రూ. 13,399 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు అక్టోబర్లో రూ. 14,537 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. దీంతో ఇటీవల మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా ఎంఎస్సీఐలో ఇండియాకు వెయిటేజీ పెరగనున్నట్లు హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా పేర్కొన్నారు. దీంతో డిసెంబర్లో మరో 3 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులకు అవకాశమున్నట్లు అంచనా వేశారు.

హైజంప్
గత వారం సెన్సెక్స్ 2,279 పాయింట్లు(5.75 శాతం) జంప్ చేసి 41,893 వద్ద ముగిసింది. తద్వారా 42,000 పాయింట్ల మైలురాయిపై కన్నేసింది. నిఫ్టీ సైతం 621 పాయింట్లు(5.3 శాతం) ఎగసి 12,264 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి సమీప భవిష్యత్లో సాంకేతికంగా 12,400 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఇదేవిధంగా 11,800 స్థాయిలో సపోర్ట్ లభించగలదని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు