Work From Home: వీకెండ్‌ హోమ్స్‌కు డిమాండ్‌

18 Dec, 2021 10:35 IST|Sakshi

కొలంబస్‌.. కొలంబస్‌ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి.. సెలవు.. సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు.. అన్న పాటను నిజం చేసే ట్రెండ్‌ ఇప్పుడు ఇండియాలోనూ వచ్చేస్తోంది. కరోణా కారణంగా నెలల తరబడి ఇళ్లకే పరిమితమై ఉద్యగులు వారాంతాల్లో రిలాక్స్‌ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందు కోసం వీకెండ్‌ హోమ్స్‌ని ఎంచుకుంటున్నారు. ఈ కల్చర్‌ క్రమంగా పెరగడంతో ఇప్పుడు అందుకు తగ్గట్టుగా రియల్టర్లు వీకెండ్‌ హోం ట్రెండ్‌పై దృష్టి పెట్టారు. 

సాక్షి, హైదరాబాద్‌: నిన్నమొన్నటి దాకా కరోనా, ఇప్పుడిక ఒమిక్రాన్‌ ఇక ఇప్పట్లో సాధారణ పరిస్థితులు వచ్చేలా లేవు. దీంతో పర్యాటక ప్రేమికులు ఇళ్లకే పరిమితమైపోయారు. పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్‌ హోమ్స్‌ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి.  

దెబ్బతిన్న టూరిజం
కరోనా మహమ్మారి నేపథ్యంలో పర్యాటకం, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రజలు బయటికి వెళ్లేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సమయాన్ని గడిపే వీలున్న వీకెండ్‌ హోమ్స్‌ వైపు దృష్టి మళ్లించారు. టూరిజం డిమాండ్‌ కొంతకాలం పాటు వీకెండ్‌ హోమ్స్‌ పరిశ్రమకు మళ్లుతుందని నిర్వాణా రియాల్టీ సీఈఓ పుణీత్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఆతిథ్య రంగం వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం ఆధారంగా వీకెండ్‌ హోమ్స్‌ను డిజైన్‌ చేస్తోంది. పర్యాటక, ఆతిథ్య రంగ పరిశ్రమలు సుదీర్ఘకాలం పాటు కస్టమర్లకు అవాంతరాలు లేని విలాసవంతమైన వసతులను కల్పించడంలో తలమునకలయ్యాయని పేర్కొన్నారు.

వర్క్‌ ఫ్రం హోం ఎఫెక్ట్‌
ప్రయాణ పరిమితులపై సడలింపులు ఎత్తివేయడంతో చాలా మంది ప్రయాణాల వైపు దృష్టిమళ్లించారు. మరోవైపు ఇప్పటికీ వర్క్‌ ఫ్రం హోంలో పని చేస్తున్న వారెందరో ఉన్నారు. వీరికి కావాల్సిందల్లా మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం, చేతిలో ల్యాప్‌టాప్‌ అంతే!  రిమోట్‌ వర్క్‌ సంస్కృతి అనేది తదుపరి దశకు చేరుకుంది. ఇది దీర్ఘకాలం పాటు ఉండే విధానం. ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజాలతో పాటు అనేక భారతీయ కంపెనీలు రిమోట్‌ వర్క్‌ కల్చర్‌ను రెండో దశలోకి తీసుకెళ్లాయి. కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోయినా సరే ఆయా కంపెనీ శాశ్వత వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రకటించేలా ఉన్నాయి. దీంతో స్టేకేషన్స్‌కు మరింత డిమాండ్‌ ఏర్పడుతుంది. 


 
ట్రెండ్‌కు తగ్గట్టుగానే డెవలపర్లు
వీకెండ్‌ హోమ్స్‌ విలాసవంతమైనవి కావటం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు వీటి కొనుగోళ్లలో దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్స్‌ హోమ్స్‌ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్‌ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్‌ హోమ్స్‌ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. మరోవైపు కొందరు కస్టమర్లు వీకెండ్‌ హోమ్స్‌ను బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) కంపెనీలకు అద్దెకు ఇచ్చి ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీటిని అద్దెకు తీసుకుంటున్నారు. ఇప్పట్లో దేశీయ ప్రయాణాలు అంత సురక్షితం కాదని, విదేశీ యాత్రల ఊసేలేని నేపథ్యంలో వీకెండ్‌ హోమ్స్‌కు డిమాండ్‌ అనివార్యమైంది. 

చదవండి: ఈ విషయంలో శాన్‌ఫ్రాన్సిస్కోని వెనక్కి నెట్టిన న్యూఢిల్లీ

మరిన్ని వార్తలు