ఉద్యోగులకు షాకిచ్చిన ‘ఫిజిక్స్‌వాలా’

20 Nov, 2023 09:08 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ సంస్థ ఫిజిక్స్‌ వాలా ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. 70  నుంచి 120 మంది ఉద్యోగుల్ని తొలగించింది. దీంతో నిధుల కొరత కారణంగా ఉద్యోగుల్ని తొలగించిన జాబితాలో ఫిజిక్స్‌ వాలా చేరిపోయింది. అయితే ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.  

పిడబ్ల్యూలో మేం మిడ్‌ టర్మ్‌, అక్టోబర్‌ నెల ముగిసే సమయానికి ఎండ్‌ టర్న్‌ సైకిల్స్‌లో ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తాం. ఫిజిక్స్‌ వాలా మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో 0.8శాతం కంటే తక్కువ అంటే 70 నుండి 120 మంది ఉద్యోగుల్లో పనితీరులో సమస్యలు ఉన్నట్లు గుర్తించాము’ అని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సతీష్ ఖేంగ్రే ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో అదనంగా 1000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నామని, ఇది వృద్ధి పట్ల తమ నిబద్ధతను బలపరుస్తుందని ఖేంగ్రే తెలిపారు.

ఫిజిక్స్‌ వాలా గత ఏడాది రూ.100 కోట్ల యూనికార్న్‌ క్లబ్‌లో చేరింది. ఈ కంపెనీలో వెస్ట్‌బ్రిడ్జ్‌ కేపిటల్‌, జీఎస్‌వీ వెంచర్స్‌ వంటి కేపిటల్‌ మార్కెట్‌ కంపెనీలు 1 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడి దారులు తమ ఫోర్ట్‌ ఫోలియో కంపెనీ ఫిజిక్స్‌ వాలాలో పెట్టిన పెట్టుబడులతో లాభాల్ని గడించాలని భావిస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

ఈ ఏడాది ప్రారంభంలో ఫిజిక్స్ వాలా తన విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా కేరళకు చెందిన సైలెమ్ లెర్నింగ్ లో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు