ఓపెన్‌ఏఐలో ఆసక్తికర పరిణామాలు, సీఈఓగా ఆల్ట్‌మన్‌?

19 Nov, 2023 13:47 IST|Sakshi

చాట్‌జీపీటీ సృష్టికర‍్త, ఓపెన్‌ ఏఐ మాజీ సీఈఓ శామ్‌ అల్ట్‌మన్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారా? శనివారం ఆల్ట్‌మన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం టెక్‌ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. అయితే ఆల్ట్‌మన్‌ను మళ్లీ తిరిగి తీసుకోవాలని ఓపెన్‌ ఏఐ ప్రధాన పెట్టుబడి దారులు ఒత్తిడి తెస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు

ఓపెన్‌ ఏఐ బోర్డ్‌ సభ్యులు సంస్థ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు ఇన్వెస్టర్లు బోర్డ్‌ సభ్యులతో చర్చిస్తున్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓపెన్‌ఏఐ ఇన్వెస్టర్లు కంపెనీ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఆల్ట్‌మన్‌ని సీఈఓగా నియమించాలని కోరుతూ పెట్టుబడి దారులు ఓపెన్‌ ఏఐలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్‌తో సైతం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 

మైక్రోసాఫ్ట్‌ సైతం మద్దతు
ఆల్ట్‌మన్‌కు ఉద్వాసన పలికిన ఓపెన్‌ఓఐ బోర్డు సభ్యులు తాత్కాలిక సీఈవోగా మిరా మురాటిని ఎంపిక చేసుకున్నారు. బోర్డు నిర్ణయం మేరకు మిరా మురాటికి మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల మద్దతు పలికారు. అయితే, తాజాగా మళ్లీ సీఈఓగా తిరిగి ఆల్ట్‌మన్‌ తీసుకోవాలన్న పెట్టుబడిదారుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ సత్యనాదెళ్ల ఓపెన్‌ ఏఐ మాజీ సీఈఓతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.  

ఓపెన్‌ ఏఐ సిబ్బంది హెచ్చరికలు 
ఓపెన్‌ ఏఐ సీఈఓగా శామ్‌ ఆల్ట్‌మన్‌ను సీఈఓగా తీసుకోవాలని, లేదంటే సంస్థ నుంచి బయటకు వెళ్లిపోతామంటూ సిబ్బంది బోర్డు సభ్యులకు హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

ఆల్ట్‌మన్‌ సొంత వెంచర్‌
ఓపెన్‌ఏఐతో జరుగుతున్న చర్చలు విఫలమైతే ఆల్ట్‌మన్ తన సొంత వెంచర్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఆయనకు మద్దతుగా మాజీ ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్‌మాన్ సైతం అదే బాటలో ఉన్నారనని నివేదికలు పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు