ఎన్నికల ఫలితాలు, ఆర్‌బీఐ నిర్ణయం కీలకం

4 Dec, 2023 07:12 IST|Sakshi

బుల్‌ ర్యాలీ కొనసాగొచ్చు

ఈ వారం మార్కెట్‌పై

నిపుణులు అంచనా 

ముంబై: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్‌ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్‌ ధరలు, రపాయి కదలికలపైనా దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. 

ఈ ఎన్నికలు 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తున్నందున, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కానుందని మార్కెట్‌ వర్గాలు విశ్వసిస్తున్నాయి. నిఫ్టీ ఇప్పటికే సరికొత్త శిఖరానికి చేరుకుంది. కావున తదుపరి నిరోధం 20,500–20,800 స్థాయిని చేధించేందుకు ప్రయత్నం చేసుకుంది. ఇదే సమయంలో సచీలు వారం రోజులు ర్యాలీ నేపథ్యంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. దిగువ స్థాయిలో 19850–20050 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని మెహతా ఈక్విటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ తాప్సే తెలిపారు.

బుధవారం ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం
ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కమిటీ బుధవారం( డిసెంబర్‌ 6న) ప్రారంభం కానుంది. చైర్మన్‌ శక్తికాంత దాస్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనున్నారు. ద్రవ్యోల్బణ దిగిరావడంతో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే సప్లై సమస్యలు, వృద్ధి అవుట్‌లుక్‌లతో పాటు వచ్చే ఏడాది వడ్డీరేట్ల తగ్గింపు అభిప్రాయాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనున్నాయి.

స్థూల ఆర్థిక గణాంకాలు
భారత్‌తో సహా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఈయూలు మంగళవారం సేవారంగ పీఐఎం గణాంకాలు ప్రకటించనున్నాయి. అమెరికా బుధవారం నవంబర్‌ ప్రైవేట్‌ రంగ ఉద్యోగ కల్పన డేటా, వీక్లీ జాబ్‌లెస్‌ గణాంకాలను గురువారం వెల్లడించనుంది. ఇదే రోజున యూరోజోన్‌ ప్రస్తుత సంవత్సరపు క్యూ3 జీడీపీ డేటా, చైనా వాణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. జపాన్‌ క్యూ3 జీడీపీ డేటా శుక్రవారం వెల్లడి అవుతుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక డేటా ప్రకటనకు ముందు మార్కెట్‌ వర్గాలు అప్రమత్తత వహించవచ్చు. 

నవంబర్‌లో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు
గత రెండు నెలలు నికర అమ్మకదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో ర.9వేల కోట్ల పెట్టబడులు పెట్టారు. అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గడంతో పాటు దేశీయ మార్కెట్‌ బౌన్స్‌ బ్యాక్‌ ర్యాలీ ఇందుకు కారణమని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇదే నెలలో డెట్‌ మార్కెట్‌లో ర.14,860 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత్‌ వృద్ధి రానున్న రోజుల్లో మరింత పెరగడం, బలమైన ఆర్థిక డేటా, ప్రోత్సాకర కార్పొరేట్‌ ఆదాయాలు తదితర కారణాలతో దేశీ మార్కెట్లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి’’ అని నిపుణులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు