ఫిబ్రవరిలో భారీ ఉపాధి కల్పన!

22 Apr, 2023 06:36 IST|Sakshi

ఈపీఎఫ్‌ఓలో 13.96 లక్షల సభ్యత్వం నమోదు

వీరిలో కొత్త చందాదారులు 7.38 లక్షల మంది  

న్యూఢిల్లీ: రిటైర్‌మెంట్‌ ఫండ్‌ బాడీ– ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌) 2023 ఫిబ్రవరి 13.96 లక్షల మంది నికర చందాదారులను నమోదు చేసుకుంది. వీరిలో దాదాపు 7.38 లక్షల మంది మొట్టమొదటిసారి కొత్తగా ఈపీఎఫ్‌ఓ పరిధిలోనికి వచ్చినవారని కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. ప్రకటనలో ముఖ్యాంశాలు..

► కొత్తగా చేరిన సభ్యుల్లో అత్యధికంగా 2.17 లక్షల మంది సభ్యులు 18–21 ఏళ్ల మధ్య వయస్సు గలవారు.  1.91 లక్షల మంది సభ్యులు 22–25 ఏళ్ల మధ్య వయస్సు గలవారు.  
► మొత్తం కొత్త సభ్యులలో 18–25 సంవత్సరాల మధ్య వయస్కులు 55.37 శాతం మంది.  దేశంలోని సంఘటిత రంగంలో భారీగా ఉపాధి అవ కాశాలు కలిగినట్లు ఈ సంఖ్య తెలియజేస్తోంది.  
► నికర మహిళా సభ్యుల నమోదు 2.78 లక్షలు. ఈ నెలలో నికర సభ్యుల చేరికలో ఇది దాదాపు 19.93%. నికర మహిళా సభ్యుల సంఖ్యలో  1. 89 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు.  
► నికర సభ్యుల చేరికలో నెలవారీగా పెరుగుతున్న ధోరణిని చూస్తే,  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ మొదలైన రాష్ట్రాలు తొలి వరుసలో ఉన్నాయి.  
► పరిశ్రమల వారీగా చూస్తే.. నిపుణుల సేవల విభాగం (మానవ వనురుల సరఫరాదారులు, సాధారణ కాంట్రాక్టర్‌లు, సెక్యూరిటీ సర్వీసెస్,  ఇతర కార్యకలాపాలు మొదలైనవి)  మొత్తం సభ్యుల చేరికలో 41.17 శాతంగా ఉంది.  
► తోలు ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, కొరియర్‌ సేవలను అందించడంలో నిమగ్నమైన సంస్థలు, చేపల ప్రాసెసింగ్,  నాన్‌–వెజ్‌ ఫుడ్‌ ప్రిజర్వేషన్‌ మొదలైన పరిశ్రమలకు సంబంధించి ఈపీఎఫ్‌ఓలో అధిక నమోదులు ఉన్నాయి.  

నిరంతర ప్రక్రియ...
ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ.  ఈ ప్రాతిపదికన పేరోల్‌ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్‌ 2018 నుండి  (సెప్టెంబర్‌ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్‌ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్‌ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్ర తా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్‌ ప్రయోజనాలు అలాగే సభ్యు డు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్,  బీమా ప్రయోజనాలను అందిస్తుంది.

ఈపీఎఫ్‌ఓ దాదాపు 7 కోట్ల  మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది.  పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది.  ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్‌ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది.  డెట్‌ ఇన్వెస్ట్మెంట్‌ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్‌ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్‌ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు,  ప్రస్తుతం 15 శాతానికి చేరాయి.

మరిన్ని వార్తలు