స్టాక్స్‌లో ఈపీఎఫ్‌వో మరిన్ని పెట్టుబడులు

7 Jun, 2022 06:29 IST|Sakshi

25 శాతానికి పెంచాలని కమిటీ సిఫారసు

ప్రస్తుతం ఈక్విటీల వాటా 15 శాతమే

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సొమ్ములో ఈక్విటీ వాటా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈక్విటీ వాటా పెంచడం వల్ల మరిన్ని రాబడులకు అవకాశం ఉంటుంది. అప్పుడు సభ్యులకు మెరుగైన రాబడి రేటు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈపీఎఫ్‌ నిధిలో ఈక్విటీ వాటాను 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ఈపీఎఫ్‌వో పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఈపీఎఫ్‌ తన మొత్తం నిర్వహణ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతమే కేటాయిస్తోంది. ఈక్విటీలకు మరిన్ని పెట్టుబడులు కేటాయించడం వల్ల డెట్‌ సాధనాల్లో రాబడుల అంతరాన్ని పూడ్చుకోవచ్చని ఈపీఎఫ్‌వో ఆలోచనగా ఉంది. రాబడుల లక్ష్యాలను చేరుకోలేకపోతున్న దృష్ట్యా ఈక్విటీల వాటా పెంచడం ద్వారా ఆ సమస్యను అధిగమించొచ్చన్న అభిప్రాయం ఉంది. ఈపీఎఫ్‌వోకు చెందిన ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ రెండు వారాల క్రితమే సమావేశమైంది.

ఈ అంశంపై చర్చించి ఈక్విటీల వాటాను 25 శాతం పెంచేందుకు సిఫారసు చేసింది. ఒకే విడత కాకుండా తొలుత 15 శాతం నుంచి 20 శాతానికి ఈక్విటీ పెట్టుబడులను తీసుకెళతారు. అక్కడి నుంచి 25 శాతానికి పెంచుతారు. ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ సిఫారసుపై జూన్‌ చివరి వారంలో జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సీబీటీ దీనికి ఆమోదం తెలిపితే దాన్ని తుది ఆమోదం కోసం కేంద్ర కార్మిక శాఖకు, కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు