చిన్నపిల్లలకు ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాన్‌.. లైంగిక వేధింపుల మాటేంటి?

28 Sep, 2021 08:31 IST|Sakshi

Instagram Kids Version: ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ టీనేజర్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్న ఆరోపణలు ఖండించిన ఓనర్‌ కంపెనీ ఫేస్‌బుక్‌.. ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టా వెర్షన్‌ను తీసుకురావాలనే ప్రయత్నాల్ని తాత్కాలికంగా పక్కనపెట్టేయాలని నిర్ణయించుకుంది. 


ఇన్‌స్టాగ్రామ్‌ కిడ్స్‌ పేరిట ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గతకాలంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు.  ఆల్రెడీ యాప్‌ డెవలప్‌మెంట్‌ పనులు ఎప్పుడో పూర్తికాగా.. నేడో రేపో అది లాంచ్‌ కావాల్సి ఉంది.  అయితే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ వికృతమైన అడ్డాగా మారుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌ ఈమధ్య వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ వల్ల యువత మానసికంగా కుంగిపోతోందని, ఆత్మహత్యలకు పాల్పడుతోందని, ఇదంతా తెలిసి కూడా ఫేస్‌బుక్‌-ఇన్‌స్టాగ్రామ్‌లు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కథనాలు ప్రచురించింది.

 

అయితే ఈ కథనాల్ని ఖండించిన ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ‘ఆడమ్‌ మోసెరి’.. తాజాగా కిడ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రయత్నాలపై స్పందించారు. చాలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, మేధావులు, విశ్లేషకులు, పాలసీ మేకర్స్‌, నియంత్రణ విభాగాల నుంచి పూర్తి స్థాయి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాకే.. కిడ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను తీసుకొస్తామని వెల్లడించారు. ఈ వెర్షన్‌లో పేరెంటింగ్‌ టూల్‌ ఉంటుందని, పిల్లల యాక్టివిటీస్‌ను నిరంతరం పెద్దలు పర్యవేక్షించవచ్చని, త్వరలో ఈ టూల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని మోసెరి అన్నారు.     

ప్రస్తుతం 13 ఏళ్లు పైబడిన పిల్లలు మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌ ఉపయోగించాలని, ఒకవేళ పిల్లల పేరిట అకౌంట్లు ఉన్నా పర్యవేక్షకులు ఆ అకౌంట్‌ను నిర్వర్తించొచ్చని గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. అయితే 13 ఏళ్ల లోబడిన పిల్లల కోసం ఫేస్‌బుక్‌.. కొత్త ఇన్‌స్టా వెర్షన్‌ను తీసుకురావాలని చూస్తోంది. 

ఈ ఏడాది మార్చి నెలలో ఈ కిడ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వెర్షన్‌ గురించి అధికారిక ప్రకటన చేశాడు మార్క్‌ జుకర్‌బర్గ్‌. మే నెలలో ఇది వస్తుందనే అంచనాలు ఉండగా.. ఆ టైంలో 44 మంది అటార్నీ జనరల్స్‌ ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలంటూ జుకర్‌బర్గ్‌కు ఓ లేఖ రాశారు.  ఇది సైబర్‌ వేధింపులకు దారితీస్తుందని, లైంగిక వేధింపులకూ ఆస్కారం ఉండొచ్చని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అభ్యంతరాలపై ఫేస్‌బుక్‌ నుంచి స్పందన కరువైంది. మరో విశేషం ఏంటంటే.. 2017లో ఫేస్‌బుక్‌లోనూ మెసేంజర్‌ కిడ్‌ యాప్‌ తీసుకురాగా.. దానిపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.

చదవండి: అమ్మాయిలూ సోషల్‌ మీడియాలో ఆ ఆలోచనలు ప్రమాదకరం!!

మరిన్ని వార్తలు