చేతబడి చేయించింద‌నే కోపంతో భార్య తలపై సిలిండర్‌తో బాది..

25 Nov, 2023 09:40 IST|Sakshi
సువర్ణ (ఫైల్‌)

పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు

న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన

పెంట్లవెల్లి: భార్య తలపై సిలిండర్‌తో బాది భర్త హతమార్చిన ఘటన మండలంలోని జటప్రోల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన యాదగిరికి కల్వకోల్‌కు చెందిన సువర్ణ (32)తో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగించేవారు.

భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడగా పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. 5 నెలల కిందట సువర్ణ భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి జటప్రోల్‌కు వచ్చి ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పాఠశాలలకు పంపిస్తూ ఉండేది. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికొచ్చిన యాదగిరి తన తమ్ముడికి పెళ్లి కాకుండా, కుటుంబం సంతోషంగా ఉండకూడదని చేతబడి చేయించావంటూ భార్యతో గొడవపడి చితకబాదాడు.

చివరకు సిలిండర్‌తో తలపై బలంగా బాదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని పెద్ద కుమార్తె పోలీసులు, చుట్టుపక్కల వారికి తెలియజేసింది. అనంతరం యాదగిరి ఇద్దరు పిల్లలతో పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఠాణాకు చేరుకున్న బంధువులు పిల్లలకు న్యాయం చేయాలని, నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన స్థలాన్ని సీఐ యాలాద్రి, ఎస్‌ఐ సురేష్‌ పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు