కొంపముంచిన కోతి బొమ్మ.. చిటికేసినంత ఈజీగా రెండు కోట్ల రూపాయలు లాస్‌!

15 Dec, 2021 09:49 IST|Sakshi

Bored Ape NFT Loss To Trader During Online Sale: కంగారు.. ఏమరపాటులో చేసే పనులు ఒక్కోసారి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇక్కడ కోట్లు కలిసి వస్తాయని ఆశపడ్డ ఆ వ్యక్తికి.. నష్టమే మిగిలింది. పొరపాటున బోటన వేలు తగిలి దాదాపు రెండు కోట్ల రూపాయలు లాస్‌ అయ్యాడు. 


వివరాల్లోకి వెళ్తే..  బోర్‌డ్‌ ఏప్‌ (దిగాలుగా ఉన్న కోతి).. మీమ్‌ నుంచి ఎన్‌ఎఫ్‌టీ (నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్‌) ఫ్రాంచైజీగా ఎదిగి..  బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో భారీ బిజినెస్‌ చేస్తోంది. సుమారు పది వేల పీసులు ఉన్న ‘బోర్‌డ్‌ ఏప్‌’ ఎఎఫ్‌టీ యాట్చ్‌ క్లబ్‌లో హాలీవుడ్‌ సెలబ్రిటీలు జిమ్మీ ఫాలోన్‌, స్టెఫ్‌ కర్రీలాంటోళ్లు సైతం  ఉన్నారు. ఇప్పటివరకు గరిష్టంగా ఇది 85 ఎథెర్‌(క్రిప్టోకరెన్సీ కాయిన్‌ ఎథెర్‌.. 3, 20,000 డాలర్లకు సమానం) అమ్ముడుపోవడం విశేషం.

అయితే ఈమధ్యే కాలంలో ఈ ఎన్‌ఎఫ్‌టీ 3 లక్షల డాలర్లకు(2,28,15,750రూ.) తక్కువ కాకుండా ట్రేడ్‌ అవుతోంది. దీంతో  తన దగ్గరున్న ఎన్‌ఎఫ్‌టీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు ఓ ట్రేడర్‌. మాక్స్‌ అనే వ్యక్తి (మ్యాక్స్‌నాట్‌ యూజర్‌నేమ్‌) 75 ఎథర్‌లకు (3 లక్షల డాలర్లకు) ఆ ఎన్‌ఎఫ్‌టీ పీస్‌ను ఆన్‌లైన్‌లో అమ్మేయాలనుకున్నాడు. అయితే ధర నిర్ధారించేలోపు.. పొరపాటున అతని బోటన వేలు కంప్యూటర్‌ మౌస్‌ క్లిక్‌ అయ్యింది. దీంతో ధర 0.75 ఎథర్‌(3,000 డాలర్లు)గా కన్ఫర్మ్‌ అయ్యింది. తప్పును సరిదిద్దుకునే లోపే ఆ ప్రైస్‌ ఫిక్స్‌ అయిపోయింది. ఇక అంతే.. 

మన కరెన్సీ విలువ ప్రకారం.. 2,28,10,800రూ. అమ్ముడుపోవాల్సిన ఈ ఎన్‌ఎఫ్‌టీ.. కేవలం రూ. 2, 20, 000లకు అమ్ముడుపోయింది అది.  తనకు వాటిల్లిన నష్టంపై ఘోల్లుమంటూ ఆ యూజర్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. చికేసినంత ఈజీగా రెండున్నర లక్షల డాలర్లు.. (మన కరెన్సీలో రెండున్నర కోట్ల రూపాయల దాకా) నష్టపోయానని వాపోయాడు. ఇందులో మరో దరిద్రం ఏంటంటే.. గతంలోనూ ఈ యూజర్‌కు ఇలానే ఆన్‌లైన్‌ సేల్‌ ద్వారా 20,000 డాలర్ల (15 లక్షల రూపాయల దాకా) నష్టం వాటిల్లడం.

ఎన్‌ఎఫ్‌టీ అంటే
బిట్‌ కాయిన్‌, డిగో కాయిన్‌, ఈథర్‌నెట్‌ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు.

చదవండి: జస్ట్‌ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్‌..!

మరిన్ని వార్తలు