ఎక్కడికెళ్లినా ఈ పాడు బుద్ది పోదా.. మెటావర్స్‌లో లైంగిక వేధింపులు

27 May, 2022 18:04 IST|Sakshi

పాడుబుద్ది గల మగవాళ్లు ఎక్కడికి వెళ్లినా తమ వంకర చేష్టలను వదులుకోవడం లేదు. ఇప్పటికే అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్ల స్త్రీలపై లైంగికదాడికి పాల్పడుతున్న కామంధులు ఆఖరికి టెక్నాలజీతో పుట్టుకొచ్చిన మెటావర్స్‌ను వదలడం లేదు. ఈ వర్చువల్‌ ప్రపంచంలోనూ మహిళలపై దుశ్చర్యలకు దిగుతూనే ఉన్నారు.

లైంగిక వేధింపులు
కార్పొరేట్‌ జవాబుదారీ గ్రూప్‌కి చెందిన రీసెర్చర్లు సమ్‌ ఆఫ్‌ ఆజ్‌ పేరుతో తెలిపిన వివరాల ప్రకారం  మెటావర్స్‌లో పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ 21 ఏళ్ల యువతి లైంగిక వేధింపులకు గురైంది. హారిజోన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మరో యువకుడు మెటావర్స్‌లోకి ఎంటరై..ఆ యువతి మెటావర్స్‌ బాడీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు తేలింది. ఇటీవల జరిగిన మెటా వార్షిక సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.

ఏం చేద్దాం
మెటావర్స్‌ అనుభూతిని మరింత సమర్థంగా అందించే వ్యవస్థగా హారిజోన్స్‌ ఉంది. కెనాడా, యూఎస్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా మెటా ప్రపంచంలోకి ఎంటర్‌ కావొచ్చు. అంటే మనం వాస్తవ ప్రపంచంలో ఉంటే మనలాంటి అవతరామే కృత్రిమ ప్రపంచంలో విహరిస్తుంది. ఇది పూర్తిగా నియంత్రిత ఆర్టిఫిషియల్‌ ప్రపంచం అయినందున ఇక్కడికి వచ్చే వారి సెక్యూరిటీ గ్యారెంటీ అనే భావన ఉండేది. కానీ మెటావర్స్‌లోనూ సెక్యూరిటీ పరంగా కొన్ని లోపాలు ఉన్నట్టు తాజా ఘటనతో వెల్లడైంది. దీంతో మెటావర్స్‌లో యూజర్ల భద్రతకు సంబంధించి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

మెటావర్స్‌ అంటే
మెటావర్స్‌ అసలు నిజమైన ప్రపంచం కాదు. మనం జీవిస్తున్న యూనివర్స్‌కి అనుబంధంగా వర్చువల్‌ రియాల్టీ, ఆగ్యుమెంటెడ్‌ రియల్టీ, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ వంటి టెక్నాలజీ జోడించి సాంకేతిక పరికరాలు ధరించి మరో కొత్త ప్రపంచాన్ని మెటా సృష్టించింది. దీనికి మెటావర్స్‌ అని పేరు పెట్టింది. నియంత్రిత సాంకేతిక ప్రపంచం అయినందున అక్కడికి వెళ్లే ‘అవతార్‌’లకు ఎటువంటి సమస్య ఉండదని అంతా నమ్మారు. కానీ తాజా ఘటనతో మెటావర్స్‌లోకి వచ్చే యూజర్లలోనూ ఎవరైనా హద్దులు మీరితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉదయించాయి. మరి వీటికి మెటా ఎలాంటి పరిష్కారం కనుక్కుంటుందో చూడాలి. 

చదవండి: మన ముందుకు మెటా ప్రపంచం.. ఎప్పటి నుంచి అంటే?

మరిన్ని వార్తలు