మనీలాండరింగ్‌పై పోరుకు భారత్‌ కట్టుబడి ఉంది

23 Apr, 2022 09:01 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

ఎఫ్‌ఏటీఎఫ్‌ కృషికి అభినందన  

వాషింగ్టన్‌: నగదు అక్రమ చెలామణీ (మనీలాండరింగ్‌), ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్‌ కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రక్షణ కోసం ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌)’ పోషిస్తున్న పాత్రను ఆమె అభినందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్‌), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ మంత్రుల సమావేశాన్ని కూడా నిర్వహించారు. దీనికి నిర్మలా సీతారామన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఎఫ్‌ఏటీఎఫ్‌ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు (2022–24 సంవత్సరాలకు) ఆమోదం తెలిపారు. 1989లో ఏర్పాటైన ఎఫ్‌ఏటీఎఫ్‌ అంతర్‌ ప్రభుత్వ సంస్థగా పనిచేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు హాని చేసే మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్, ఇతర సమస్యలపై పోరాడటమే ఈ సంస్థ ఎజెండా. ఎఫ్‌ఏటీఎఫ్‌ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సీతారామన్‌ మద్దతు పలికారు. మనీలాండరింగ్, టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్, సామూహిక హననానికి దారితీసే ఆయుధాలకు ఫైనాన్సింగ్‌ను అడ్డుకోవడం కోసం.. ప్రపంచకూటమిగా ఎఫ్‌ఏటీఎఫ్‌ చేస్తున్న కృషికి వనరులను సమకూరుస్తామన్నారు.

అమెరికన్‌ కంపెనీల సీఈవోలతో భేటీ 
తన పర్యటనలో భాగంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థలు ఫెడ్‌ఎక్స్, మాస్టర్‌కార్డ్‌ సీఈవోలతో భేటీ అయ్యారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో వ్యాపార అవకాశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. భారత్‌ మార్కెట్‌ పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నామని, నైపుణ్య శిక్షణ సహా పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికలు ఉన్నట్టు ఫెడ్‌ఎక్స్‌ ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులైన రాజ్‌ సుబ్రమణ్యం తెలిపారు. భారత్‌లో పరిశోధన అభివృద్ధి కేంద్రాలను (ఆర్‌అండ్‌డీ) ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు సుబ్రమణ్యం తెలిపారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యయాలు తగ్గించేందుకు రూ. 100 లక్షల కోట్లతో కూడిన నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌ను ప్రధాని గతేడాది ప్రారంభించడం గమనార్హం. యాక్సెంచర్‌ చీఫ్‌ జూలీ స్వీట్, మాస్టర్‌ కార్డ్‌ సీఈవో మిబాచ్‌ మైకేల్, డెలాయిట్‌ సీఈవో పునీత్‌ రంజన్‌తోనూ సీతారామన్‌ సమావేశమయ్యారు.

చదవండి👉🏼 ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు!

మరిన్ని వార్తలు