ఫ్లిప్‌కార్ట్‌.. ఇక హోల్‌సేల్‌

24 Jul, 2020 04:54 IST|Sakshi

వాల్‌మార్ట్‌ ఇండియా కొనుగోలు

ఆగస్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభం

నిత్యావసరాలు, ఫ్యాషన్‌పై దృష్టి

న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా హోల్‌సేల్‌ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా వాల్‌మార్ట్‌ ఇండియాను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్‌ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ పేరిట వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంస్థ గురువారం తెలిపింది.

ప్రధానంగా బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) విభాగంలో కార్యకలాపాల కోసం ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ ఏర్పాటైనట్లు వివరించింది. వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ఇన్వెస్టర్‌ గ్రూప్‌ నుంచి 1.2 బిలియన్‌ డాలర్లు సమీకరించిన వారానికే ఫ్లిప్‌కార్ట్‌ తాజా ప్రకటన చేయడం గమనార్హం. ‘ఒకవైపు విక్రేతలు, తయారీదారులను మరోవైపు కిరాణా దుకాణదారులు, చిన్న మధ్యతరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) అనుసంధానం చేసేలా ఈ మార్కెట్‌ప్లేస్‌ ఉంటుంది‘ అని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్శ్‌ మీనన్‌ చెప్పారు.

కిరాణా దుకాణదారులు, ఎంఎస్‌ఎంఈల అవసరాలను తీర్చే సామర్థ్యాలను పెంచుకునేందుకు వాల్‌మార్ట్‌ ఇండియా కొనుగోలు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఫినిష్డ్‌ ఉత్పత్తులకు సంబంధించి బీ2బీ మార్కెట్‌ విలువ సుమారు 650 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో ముందుగా ఫ్యాషన్, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్‌ వంటి కేటగిరీలు ఉన్న సుమారు 140 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌పై మేం దృష్టి సారిస్తున్నాం‘ అని మీనన్‌ చెప్పారు.  

భారత్‌లో వాల్‌మార్ట్‌ ఇలా..
ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్‌ సంస్థ అయిన అమెరికన్‌ కంపెనీ వాల్‌మార్ట్‌ గతంలో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వామ్యంతో భారత్‌లో హోల్‌సేల్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. 2013లో రెండు సంస్థలు విడిపోయినప్పటికీ వాల్‌మార్ట్‌ మాత్రం సొంతంగా బెస్ట్‌ ప్రైస్‌ పేరిట క్యాష్‌–అండ్‌–క్యారీ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఇందులో సుమారు 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. బెస్ట్‌ ప్రైస్‌కు తొమ్మిది రాష్ట్రాల్లో 28 స్టోర్స్, 15 లక్షల పైచిలుకు సభ్యులు ఉన్నారు. త్వరలోనే తిరుపతిలో కొత్తగా క్యాష్‌–అండ్‌–క్యారీ స్టోర్‌ ఏర్పాటు చేస్తోంది. వాల్‌మార్ట్‌కి పూర్తి అనుబంధ సంస్థగా వాల్‌మార్ట్‌ ఇండియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2018లో సుమారు 16 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది.  

కొత్త సంస్థ స్వరూపం..: ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ వ్యాపార విభాగానికి మీనన్‌ సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం వాల్‌మార్ట్‌ ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సమీర్‌ అగర్వాల్‌.. బాధ్యతల బదలాయింపు సజావుగా పూర్తయ్యే దాకా ఉంటారు. ఆ తర్వాత వాల్‌మార్ట్‌లోనే మరో హోదాకు మారతారు. వాల్‌మార్ట్‌ ఇండియాలోని ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌లోకి మారతారు. వాల్‌మార్ట్‌  టెక్నాలజీ విభాగం తమ వాల్‌మార్ట్‌ ల్యాబ్స్‌ ఇండియాను విడిగా నిర్వహించడం కొనసాగిస్తుంది.

కిరాణా షాపులు కీలకం..
కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో కిరాణా దుకాణదారులు గతంలో కన్నా మరిన్ని మార్గాల్లో కొనుగోళ్లు జరుపుతున్నారని, బెస్ట్‌ ప్రైస్‌ విషయానికొస్తే తమ ఈ–కామర్స్‌ వ్యాపార విభాగం లావాదేవీలు నాలుగు రెట్లు పెరిగాయని సమీర్‌ అగర్వాల్‌ తెలిపారు. కిరాణా దుకాణదారులు ఇటు ఆన్‌లైన్, అటు ఆఫ్‌లైన్‌ మార్గంలో కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. రిటైల్‌ వ్యాపారంలో కిరాణాలు, సంఘటిత బీ2బీ సంస్థలు కీలకమని తెలిపారు. ఇందులో ఆన్‌లైన్‌ వ్యా పార విభాగం వృద్ధి గణనీయంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ద్వారా కిరాణా దుకాణదారులు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) సులభ రుణ సదుపాయాలు, వ్యాపారం.. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మరిన్ని లభించగలవని అగర్వాల్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు