Foxconn: రూ. 300 కోట్లతో 300 ఎకరాలు! కర్ణాటకలో ఫాక్స్‌కాన్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే?

14 May, 2023 16:21 IST|Sakshi

గత కొంతకాలంగా ఫాక్స్‌కాన్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సంస్థ ఇప్పుడు బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో రూ. 300కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యాపిల్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో దీని కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలోని దేవనహళ్లి వద్ద 300 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ఫాక్స్‌కాన్ హాన్ ​హై టెక్నాలజీ కోసం ఈ స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి యాపిల్ కంపెనీకి ఫాక్స్‌కాన్ అనేది అతి పెద్ద సప్లయర్. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత ఈ స్ధలం కంపెనీ స్వాధీనం చేసుకోనున్నట్లు గతంలో కర్నాటక ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ కమీషనర్ ​గుంజన్​ కృష్ణ చెప్పారు. ఇక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. కావున సంస్థ భూమిని త్వరలోనే స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిముషం.. ఇవి తెలుసుకోండి!)

కర్నాటక రాష్ట్రంలో రూ. 8 వేల కోట్లతో మొబైల్​ మాన్యుఫాక్చరింగ్​ యూనిట్​ ఏర్పాటు కోసం ఫాక్స్​కాన్​తో మార్చి 20 వ తేదీన అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫెసిలిటీలో సుమారు 50 వేల మందికి ఉపాథి లభిస్తుందని అంచనా. అంతే కాకుండా రానున్న మరో పది సంవత్సరాల్లో మరిన్ని ఉద్యోగాలు ఇందులో లభించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ఇక తెలంగాణాలో కూడా ఫాక్స్‌కాన్ భూమిని కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్‌లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్‌ఐఐసి) పార్క్‌లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు