డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో బయటపడ్డ మరో భారీ మోసం

23 Feb, 2021 14:24 IST|Sakshi

న్యూఢిల్లీ: దివాలా తీసిన దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో తవ్విన కొద్దీ మోసాలు బైటపడుతూనే ఉన్నాయి. తాజాగా రూ. 6,182 కోట్ల మేర విలువ చేసే అక్రమ లావాదేవీలను ఆడిటింగ్‌ సంస్థ గ్రాంట్‌ థార్న్‌టన్‌(జీటీ) గుర్తించింది. ‘అసలు విలువ తగ్గించి చూపేలా, మోసపూరితంగా, పక్షపాత ధోరణితో వ్యవహరించిన విధంగా‘ కొన్ని లావాదేవీలు జరిగినట్లు కంపెనీ అడ్మినిస్ట్రేటరుకు ఆడిటర్‌ నుంచి ప్రాథమిక నివేదిక వచ్చినట్లు స్టాక్‌ ఎక్స్చేంజిలకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వెల్లడించింది. ‘సుమారు రూ. 5,382 కోట్ల అసలు రుణం, రూ. 589 కోట్ల వడ్డీ బకాయి, తక్కువ వడ్డీ రేటు విధించడం వల్ల రూ. 211 కోట్ల మేర నష్టం.. అంతా కలిపి దాదాపు రూ. 6,182 కోట్ల మేర ప్రభావం చూపే విధంగా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ట్రాన్సాక్షన్‌ ఆడిటర్‌ నివేదికలో పేర్కొంది‘ అని కంపెనీ పేర్కొంది. 

ఈ లావాదేవీలన్నీ కొన్నేళ్ల పాటు క్రమంగా జరిగాయని గ్రాంట్‌ థార్న్‌టన్‌ వివరించింది. జీటీ నివేదిక ఆధారంగా.. కంపెనీ ప్రమోటర్లు కపిల్‌ వాధ్వాన్, ధీరజ్‌ వాధ్వాన్‌లతో పాటు క్రియేటజ్‌ బిల్డర్స్, ఇక్షుదీప్‌ ఫిన్‌క్యాప్, రైట్‌ డెవలపర్స్‌ తదితర సంస్థలపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో అడ్మినిస్ట్రేటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పలు మోసాలు బైటపడిన నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా తీయడం, కంపెనీ నిర్వహణను ప్రస్తుతం అడ్మినిస్టేటర్‌కు అప్పగించడం తెలిసిందే. రూ.14,046 కోట్ల మేర నిధులు గోల్‌మాల్‌ చేసిందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2020 డిసెంబర్‌లో రూ.1,058 కోట్ల మోసపూరిత లావాదేవీల వ్యవహారం బయటపడింది.

చదవండి:

ఫిబ్రవరిలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు వెల్లువ 

ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు