5 మిలియన్‌ టన్నుల హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి

18 Feb, 2022 04:04 IST|Sakshi

2030 నాటికి కేంద్రం లక్ష్యం

గ్రీన్‌ హైడ్రోజన్‌ విధానం తొలి భాగం ఆవిష్కరణ

న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూలమైన హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తిని 2030 నాటికి 5 మిలియన్‌ టన్నుల స్థాయికి పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్‌ పంపిణీపై పాతికేళ్ల పాటు అంతర్‌రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు లభించనుంది. జాతీయ హైడ్రోజన్‌ విధానం తొలి భాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్‌ కుమార్‌ సింగ్‌ ఈ విషయాలు తెలిపారు.

కొత్త విధానాన్ని వివరించేందుకు త్వరలో పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. హరిత హైడ్రోజన్, అమోనియాల వినియోగం పెరిగితే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.   సాధారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చమురు రిఫైనరీలు మొదలు, ఉక్కు ప్లాంట్ల వరకూ చాలా సంస్థలకు హైడ్రోజన్‌ అవసరమవుతుంది.

ప్రస్తుతం సహజ వాయువు లేదా నాఫ్తా వంటి శిలాజ ఇంధనాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు వెలువడి కాలుష్య కారకంగా మారుతున్నందున పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా విధానాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రెండో విడతలో దశలవారీగా ప్లాంట్లు హరిత హైడ్రోజన్, హరిత అమోనియా వినియోగించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు.  

ఎక్కడైనా ప్లాంటు..: కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను కంపెనీలు దేశంలో ఎక్కడైనా సొంతంగానైనా లేదా డెవలపర్‌ ద్వారానైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్సే్చంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ విద్యుత్‌ను హైడ్రోజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంటు వరకు ట్రాన్స్‌మిషన్‌ గ్రిడ్‌ ద్వారా ఉచితంగా పంపిణీ చేయవచ్చు. ఇందుకోసం పాతికేళ్ల పాటు అంతర్‌రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. 2025 జూన్‌ 30 లోగా ఏర్పాటైన ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. అలాగే వినియోగించుకోని పునరుత్పాదక విద్యుత్‌ను గ్రీన్‌ హైడ్రోజన్, అమోనియా తయారీదారులు.. 30 రోజుల పాటు పంపిణీ సంస్థ వద్దే అట్టే పెట్టుకుని, అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు.

మరిన్ని వార్తలు