అక్కడ మొదటి హైడ్రోజన్‌ రైలు.. త్వరలోనే ట్రయల్స్‌

8 Oct, 2023 21:36 IST|Sakshi

ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఇటీవల ప్రధాన్యత పెరుగుతోంది. కాలూష్య రహిత పర్యావరణం దిశగా ప్రపంచ దేశాలు పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్‌ ఇంధనం వెలుగులోకి  వచ్చింది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలను పలు దేశాలు ప్రోత్సహిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా సౌదీ అరేబియా త్వరలోనే హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించనుంది.  ఈమేరకు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో మొదటి హైడ్రోజన్ రైలును పరీక్షించడాన్ని తమ దేశం ప్రారంభిస్తుందని రియాద్‌లో జరిగిన UN MENA క్లైమేట్‌ వీక్‌ కార్యక్రమంలో వెల్లడించారు.

(ఇండియన్‌ ఫుడ్‌కు భారీ డిమాండ్‌.. భారత్‌ను వేడుకుంటున్న దేశాలు)

హైడ్రోజన్ రైలు అనేది విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రైలు.  హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి దాని ప్రొపల్షన్ సిస్టమ్‌కు శక్తినిస్తుంది. సంప్రదాయ డీజిల్‌తో నడిచే రైళ్ల కంటే పర్యావరణపరంగా మేలైనవి. ఇవి పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయవు.

మొట్టమొదటి హైడ్రోజన్ రైలు
"కోరాడియా ఐలింట్" అనేది హైడ్రోజన్ శక్తితో ప్రత్యేకంగా నడిచే ప్రపంచంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు. ఫ్రెంచ్ బహుళజాతి రైలు రవాణా సంస్థ Alstom దీనిని తయారు చేసింది.  2016లో దీని పరిచయం రైలు ఆధారిత హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత అభివృద్ధిలో ఒక కీలక మలుపు. ఈ రైలు ఒక ట్యాంక్ హైడ్రోజన్‌కు సుమారు 1,000 కిలోమీటర్లు నడుస్తోంది. ఇది మొదట 2018 సెప్టెంబర్‌లో జర్మనీలోని లోయర్ సాక్సోనీలో కమర్షియల్‌గా ప్రారంభమైంది.

భారత్‌లోనూ..
భారత్‌ సైతం హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను అభివృద్ధి చేస్తోందని, ఇవి 2023 డిసెంబర్‌ నాటికి సిద్ధమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో తెలిపారు. హర్యానాలోని జింద్‌-సోనీపట్‌ మార్గంలో వీటిని నడపనున్నారు.

మరిన్ని వార్తలు