మన లక్ష్యం రూ.10,000 కోట్లు: గెయిల్‌

15 Aug, 2022 19:59 IST|Sakshi

న్యూఢిల్లీ: వాటా మూలధనాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా స్పెషాలిటీ కెమికల్స్, శుద్ధ ఇంధన బిజినెస్‌లను జత చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. సహజవాయు రవాణా, పంపిణీ బిజినెస్‌కు జతగా మరిన్ని విభాగాలలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది.

రానున్న మూడు, నాలుగేళ్లలో అమలుచేయ తలపెట్టిన విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా వాటా మూలధనాన్ని ప్రస్తుత రూ. 5,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు పెంచుకునేందుకు వాటాదారుల అనుమతిని కోరినట్లు వెల్లడించింది. జాతీయ గ్రిడ్‌ను సృష్టించే బాటలో కంపెనీ నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. 2030కల్లా ప్రధాన ఇంధన బాస్కెట్‌కు 15 శాతం సహజవాయు సరఫరాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా రానున్న 3–4ఏళ్లలో గెయిల్‌ సుమారు రూ. 30,000 కోట్ల పెట్టుబడి వ్యయ ప్రణాళికలు వేసింది. వీటిలో కొంతమేర అంతర్గత వనరులు, మరికొంత రుణాలు, ఈక్విటీ మార్గంలో సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వాటాదారులకు గెయిల్‌ తాజాగా తెలియజేసింది. మరోవైపు వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదన సైతం ఉన్నట్లు పేర్కొంది. 

చదవండి: ఇదే టార్గెట్‌.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే!

మరిన్ని వార్తలు