రికార్డ్‌ స్థాయికి చమురు: పేలనున్న పెట్రో బాంబు?

31 May, 2022 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో  ముడి చమురు రికార్డు స్థాయికి చేరాయి. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌ను మూడొంతుల మేర నియంత్రించడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు అంగీకారం తెలిపాయి.  ఫలితంగా రష్యా ముడి చమురు దిగుమతి మరింత కఠినతరం కానుంది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే  క్రూడాయిల్ బ్యారెల్ ధర 124 డాలర్లకు చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బ్యారెల్ రేటు పెరగడం ఇదే తొలిసారి. 

రష్యాపై ఆరో ప్యాకేజీ కింద ఆంక్షలు, నిషేధాజ్ఞలు తీవ్రం కావడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 124 డాలర్లకు చేరడానికి దారి తీసిందీ పరిస్థితి. బ్రెంట్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌ క్రూడ్ ధరల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఇక్కడ బ్యారెల్ ధర 60 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఈ ధరల ఒత్తిడి దేశీయ ధరలపై పడే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా  కొనసాగుతున్న ఇంధన సంక్షోభం దేశీయ ఇంధన రంగం కూడా ప్రభావితం  కానుంది. 

మార్చితో ముగిసిన త్రైమాసికంలో, దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులు, రిఫైనర్ల కార్యకలాపాల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 30.5 శాతం, త్రైమాసికంలో 7.40 శాతం పెరిగాయి. అలాగే నిఫ్టీ 50లో 5 శాతానికి పైగా పతనంతో పోలిస్తే  2022లో బిఎస్‌ఇ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 7.5 శాతం లాభపడింది. అలాగే ఇండియాలోని రెండు చమురు ఉత్పత్తిదారులు ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాల మార్చి త్రైమాసికంలో నికర లాభం వరుసగా 21 శాతం, 207 శాతం జంప్ చేయడం విశేషం.

ఫిబ్రవరిలో రష్యా  ఉక్రెయిన్‌ వార్‌ మొదలైనపుడు ముడి చమురు ధరలు బ్యారెల్  100 డాలర్లకు అటూ ఇటూ కద లాడింది.  మధ్యలో కాస్త శాంతించినప్పటికీ రష్యన్ చమురు ఎగుమతులపై యూరోపియన్ యూనియన్  తాజా ఆంక్షలతో మళ్లీ బ్యారెల్ 124 డాలర్ల మార్కుకు ఎగిసింది. దీంతో పెట్రోలు ధరలు మరింత పుంజుకోనున్నా యనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్రం పన్నులను తగ్గించిన్పటికీ అంతర్జాతీయ ప్రభావంతో దేశీయంగా  మళ్లీ పెట్రో వాత తప్పదనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు చమురు ధరలు బ్యారెల్‌ 110 డాలర్లకు చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం కంటే పెద్ద ముప్పే అంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల దావోస్‌లో వ్యాఖ్యలును గుర్తు చేసుకుంటున్నారు. 
 

మరిన్ని వార్తలు