గోద్రేజ్‌ ప్రాపర్టిస్‌ లాభం మూడింతలు

3 Aug, 2023 03:58 IST|Sakshi

జూన్‌ త్రైమాసికంలో రూ.125 కోట్లు

ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధి

బుకింగ్‌లలో క్షీణత

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ప్రాపర్టిస్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.125 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.45 కోట్లతో పోల్చి చూసినప్పుడు మూడు రెట్లు వృద్ధి చెందింది. కొత్త బుకింగ్‌లు (ఇళ్లు/ఫ్లాట్‌లు) 11 శాతం తగ్గి జూన్‌ త్రైమాసికంలో రూ.2,254 కోట్లుగా ఉన్నాయి. బుకింగ్‌ల పరిమాణం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పడు 20 శాతం తగ్గి 2.25 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.426 కోట్ల నుంచి రూ1,266 కోట్లకు దూసుకుపోయింది. ఎన్‌సీడీలు, బాండ్లను ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. జూన్‌ త్రైమాసికంలో 4.9 మిలియన్‌ చదరపు అడుగుల పరిమాణంలో ఇళ్లను కస్టమర్లకు అందించింది.  

లక్ష్యం దిశగానే..
‘‘బుకింగ్‌ల పరంగా ఇది స్తబ్దతతో కూడిన త్రైమాసికం. డెలివరీలు, వ్యాపార అభివృద్ధి, నగదు వసూళ్లు అన్నీ కూడా జూన్‌ క్వార్టర్‌లో మంచి వృద్ధిని చూశాయి. బలమైన కొత్త ప్రాజెక్టుల ఆరంభ ప్రణాళికలు, బలమైన బ్యాలన్స్‌ షీట్, చెక్కుచెదరని డిమాండ్‌ ఇవన్నీ కలసి 2023–24 సంవత్సరంలో రూ.14,000 కోట్ల బుకింగ్‌ల లక్ష్యాన్ని చేరుకునే దిశలోనే ఉన్నాం’’అని గోద్రేజ్‌ ప్రాపర్టిస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ పిరోజ్‌షా గోద్రేజ్‌ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ రూ.12,232 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించడం గమనార్హం. జూన్‌లో నమోదైన తాజా బుకింగ్‌లలో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో రూ.656 కోట్లు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో రూ.548 కోట్లు, బెంగళూరు మార్కెట్లో రూ.509 కోట్లు, పుణె మార్కెట్లో రూ.446 కోట్ల చొప్పున ఉన్నాయి. ఈ నాలుగు మార్కెట్లలో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. జయశ్రీ వైద్యనాథన్‌ను అడిషనల్‌ డైరెక్టర్‌గా కంపెనీ నియమించింది.

మరిన్ని వార్తలు