అటూఇటుగా.. పసిడి, వెండి ధరలు

1 Oct, 2020 11:16 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,400కు

ఎంసీఎక్స్‌లో రూ. 60,195 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి 

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,898 డాలర్లకు

23.74 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

దేశ, విదేశీ మార్కెట్లలో బుధవారం వెనకడుగు వేసిన పసిడి, వెండి ధరలు ప్రస్తుతం స్వల్పంగా బలపడ్డాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో ట్రేడవుతున్నాయి. కోవిడ్‌-19తో డీలా పడిన ఆర్థిక వ్యవస్థతోపాటు, నిరుద్యోగులకు దన్నునిచ్చేందుకు అమెరికా కాంగ్రెస్‌ తిరిగి భారీ సహాయక ప్యాకేజీపై చర్చలు చేపట్టిన నేపథ్యంలో పసిడి, వెండి ఫ్యూచర్స్‌ బలాన్ని పుంజుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం..

వెండి ఓకే
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి నామమాత్రంగా రూ. 4 తగ్గి రూ. 50,400 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌  రూ. 276 పుంజుకుని రూ. 60,195 వద్ద కదులుతోంది. 

వెనకడుగు
వరుసగా రెండు రోజులపాటు బలపడిన బంగారం, వెండి ధరలు బుధవారం డీలా పడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 277 క్షీణించి రూ. 50,404 వద్ద ముగిసింది. తొలుత 50,860 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,150 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 2,547 పతనమై రూ. 59,919 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 61,700 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 59,460 వరకూ నీరసించింది.

స్వల్ప లాభాలతో
న్యూయార్క్‌ కామెక్స్‌లో బుధవారం ఫ్లాట్‌గా ముగిసిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్వల్పంగా బలపడ్డాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.2 శాతం పుంజుకుని 1,898 డాలర్లకు చేరగా.. స్పాట్‌ మార్కెట్లోనూ 0.4 శాతం వృద్ధితో 1,893 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్‌ 1 శాతం లాభపడి 23.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు