మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు

17 Dec, 2020 10:32 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 49,840కు

వెండి కేజీ ఫ్యూచర్స్‌ రూ. 66,863 వద్ద ట్రేడింగ్‌

కామెక్స్‌లో 1,871 డాలర్లకు ఔన్స్‌ పసిడి

25.48 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి

న్యూయార్క్/ ముంబై: ఆర్థిక వ్యవస్థకు దన్నుగా లిక్విడిటీ చర్యలను కొనసాగించనున్నట్లు యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా పేర్కొంది. కొద్ది రోజులుగా ఫెడ్‌ నెలకు 120 బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలో లిక్విడిటీని పంప్‌ చేస్తోంది. కాగా.. మరోపక్క 700 బిలియన్‌ డాలర్ల సహాయక ప్యాకేజీపై యూఎస్‌ కాంగ్రెస్‌ సమీక్షను చేపట్టనున్నట్లు వెలువడిన వార్తలు సైతం పసిడికి జోష్‌ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి వరుసగా మూడో రోజు పసిడి, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. వివరాలు చూద్దాం.. (రెండో రోజూ పసిడి, వెండి పరుగు)

సానుకూలంగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 243 పుంజుకుని రూ. 49,840 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో 49,877 వద్ద గరిష్టాన్నీ.. రూ. 49,720 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ రూ. 952 వృద్ధితో రూ. 66,863 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 66,932 వరకూ ఎగసిన వెండి రూ. 66,588 వద్ద కనిష్టాన్ని సైతం చవిచూసింది. 

హుషారుగా..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్‌ 0.65 లాభంతో 1,871 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,868 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.7 శాతం ఎగసి 25.48 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు. సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలుంది.

మరిన్ని వార్తలు