2 రోజుల ర్యాలీకి బ్రేక్‌- పసిడి, వెండి డీలా

14 Aug, 2020 09:25 IST|Sakshi

ప్రస్తుతం10 గ్రాముల పసిడి రూ. 52,587కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 70,200 వద్ద షురూ

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,956 డాలర్లకు

స్పాట్‌ మార్కెట్లోనూ 1,950 డాలర్ల వద్ద ట్రేడింగ్‌

27 డాలర్ల ఎగువన కదులుతున్న ఔన్స్‌ వెండి ధర

బంగారం, వెండి ధరల రెండు రోజుల ర్యాలీకి తాజాగా బ్రేక్‌ పడింది. అటు విదేశీ మార్కెట్లోనూ ఇటు.. దేశీయంగానూ వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 343 క్షీణించి రూ. 52,587 వద్ద ప్రారంభమైంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 877 పతనమై రూ. 70,200 వద్ద ట్రేడవుతోంది. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు వారాంతం నుంచీ ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశ, విదేశీ మార్కెట్లలో సోమ, మంగళవారాల్లో భారీగా పడిపోయిన ధరలు బుధ, గురువారాల్లో తిరిగి కోలుకున్నాయి. 

గురువారమిలా..
గురువారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 676 ఎగసి రూ. 52,930 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 53,038 వరకూ లాభపడినప్పటికీ ఒక దశలో రూ. 51,802 వరకూ డీలా పడింది. ఇక వెండి కేజీ రూ. 4,324 జంప్‌చేసి రూ. 71,077 వద్ద స్థిరపడింది. అయితే రూ. 71,430 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 66,250 వద్ద కనిష్టానికీ చేరింది. 

కామెక్స్‌లో ప్రస్తుతం
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.8 శాతం క్షీణించి 1,954 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్‌ మార్కెట్లో 0.3 శాతం నష్టంతో 1,948 డాలర్లకు చేరింది. ఇక వెండి ఔన్స్ 2 శాతం పతనమై 27.2 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గురువారం ఫ్యూచర్స్‌, స్పాట్‌ మార్కెట్లో పసిడి ధరలు మరోసారి పుంజుకోవడం గమనార్హం! ఫ్యూచర్స్‌లో ఔన్స్‌ ధర 1970 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్‌లో 1953 డాలర్ల ఎగువన ముగిసింది.

మరిన్ని వార్తలు