ఎల్‌ఐసీ ఐపీవోపై ప్రభుత్వం దృష్టి

12 Mar, 2022 00:37 IST|Sakshi

తుది పత్రాల దాఖలుకు సన్నాహాలు  

ప్రైస్‌బ్యాండ్, డిస్కౌంట్, షేర్ల సంఖ్యపై కసరత్తు

ప్రస్తుతం వేచిచూసే ధోరణిలో ప్రభుత్వం!

న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే బాటలో ప్రభుత్వం ప్రణాళికలకు తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి ధరల శ్రేణితోపాటు.. పాలసీదారులు, రిటైలర్లకు డిస్కౌంట్, రిజర్వ్‌ చేయనున్న షేర్ల సంఖ్య తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలను త్వరలోనే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేయనున్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తుండటంతో ప్రస్తుతం ప్రభుత్వం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలియజేశాయి. ముసాయిదా పత్రాలకు సెబీ నుంచి ఆమోదముద్ర పడటంతో తుది పత్రాల(ఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయవలసి ఉన్నట్లు పేర్కొన్నాయి.

5 శాతం వాటా: పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా బీమా దిగ్గజం ఎల్‌ఐసీలో ప్రభుత్వం 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఫిబ్రవరి 13న ప్రాస్పెక్టస్‌(డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయగా.. ఈ వారం మొదట్లో సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ బాటలో ఆర్‌హెచ్‌పీను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన రూ. 78,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని అందుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు