హెచ్‌డీఎఫ్‌సీ శాఖలు రెట్టింపు!

23 Jun, 2022 07:50 IST|Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ వృద్ధి ప్రణాళికలతో ఉంది. ఏటా 1,500 నుంచి 2,000 శాఖలను వచ్చే ఐదేళ్ల పాటు పెంచుకోనున్నట్టు చెప్పారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో బ్యాంకు శాఖలను రెట్టింపు చేసుకోనున్నట్టు బ్యాంకు ఎండీ, సీఈవో శశిధర్‌ జగదీశన్‌ ప్రకటించారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 6,000కు పైగా శాఖలు ఉన్నాయి. 2021–22 వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి జగదీశన్‌ ఈ విషయాలను తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ విలీనాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల భవిష్యత్తు పూర్తి భిన్నంగా ఉంటుందని ప్రకటించారు.

‘‘ఓఈసీడీ దేశాలతో పోలిస్తే జనాభా పరంగా బ్యాంకు శాఖలు భారత్‌లో తక్కువే ఉన్నాయి. అందుకే వచ్చే ఐదేళ్లలో మా శాఖల నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసుకోవాలని నిర్ణయించాం’’అని జగదీశన్‌ వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల విలీనానికి అనుకూలంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

ఈ ప్రక్రియ 15–18 నెలల్లో పూర్తవుతుందని అంచనా. హెచ్‌డీఎఫ్‌సీకి ఉన్న గొప్ప నైపుణ్యాలు, ఉత్పత్తుల పట్ల అవగాహన, అనుభవం, సిస్టమ్‌ తమకు బలంగా మారుతుందని జగదీశన్‌ పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ అవకాశాన్ని కోల్పోదన్నారు. గృహ రుణాలకు వాతావరణం పూర్తి సానుకూలంగా మారిపోయినట్టు చెప్పారు. రెరా రావడంతో ఈ రంగంలో ప్రక్రియల్లో పారదర్శకత వచ్చినట్టు అభిప్రాయపడ్డారు. ప్రాపర్టీ మార్కెట్లో ధరలు దిద్దుబాటుకు గురికాడాన్ని, పెరుగుతున్న ఆదాయాలను ప్రస్తావించారు. ఇవన్నీ తమకు అనుకూలమని చెప్పారు.   

మరిన్ని వార్తలు