నిరంకుశ శక్తులతోనే ప్రపంచానికి రిస్కు:హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ వ్యాఖ్యలు 

3 Nov, 2022 15:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సవాళ్ల కన్నా నిరంకుశ శక్తులు, సహకార కొరవడటం, వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకోవడం వంటివే ప్రపంచానికి అతి పెద్ద రిస్కులుగా మారాయని ప్రముఖ బ్యాంకరు, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ వ్యాఖ్యానించారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సంక్షోభాలను ఉటంకిస్తూ .. ప్రపంచం ప్రస్తుతం ఏకకాలంలో అనేక పెను విపత్తులను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ‘దేశాల మధ్య విశ్వాసలేమి, గ్రూపులు కట్టడం వంటివి ఎంతగానో పెరిగిపోయాయి. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు  దెబ్బతింటున్నాయి.

వాణిజ్యాన్ని ఆయుధంగా ప్రయోగించడం, పరస్పర సహకారం కొరవడటం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవి ఆర్థిక సవాళ్ల కన్నా పెద్ద రిస్కులు. ఇప్పటికే ఇంధనం, ప్రకృతి వనరులు, సెమీ-కండక్టర్లు మొదలైన అంశాల్లో మనం వీటిని చూస్తూనే ఉన్నాం‘ అని కోల్‌కతాలోని ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ విభాగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరేఖ్‌ చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మరికొన్నాళ్లు కొనసాగుతాయన్నారు.

రూపాయి పతనం విషయంలో (డాలరుతో పోలిస్తే మారకం విలువ) రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకోరాదని, దేశీ కరెన్సీ తనంత తాను సహేతుక స్థాయిని వెతుక్కునేందుకు వదిలేయాలని పరేఖ్‌ చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌ సూచించినట్లుగా దేశాలు తమ విదేశీ మారక నిల్వలను భవిష్యత్‌ షాక్‌లను ఎదుర్కొనేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు మరింత వివేకవంతంగా ఉపయోగించుకోవాలని పరేఖ్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు