ఆదాయపు పన్ను కట్టని అమెజాన్‌ సీఈవో.. మరికొందరు?

9 Jun, 2021 11:54 IST|Sakshi

యూఎస్‌లో వెలుగు చూసిన ఐటీ స్కాం

సంచలనం రేపుతున్న ప్రొపబ్లికా రిపోర్టు

డేటా లీక్‌పై ఆందోళన చెందుతున్న అమెరికన్లు

విచారణ చేపడుతున్న ఐఆర్‌ఎస్‌ 

వాషింగ్టన్‌: ఆదాయపు పన్ను కట్టడంలో ప్రపంచ కుబేరులు కక్కుర్తి పడ్డారు. బిలియన్ల కొద్ది ఆదాయం సమకూరుతున్నా పన​‍్ను ఎగ్గొట్టేందుకు వెనుకాడలేదు. ఆదాయ పన్ను అవకతవకలపై ప్రోపబ్లికా రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

పన్ను కట్టలేదు
ప్రపంచ కుబేరుల్లో ప్రథమ స్థానంలో అమెజాన్‌ సంస్థ సీఈవో జెఫ్‌ బేజోస్‌ ఉన్నారు. ఆదాయ పన్నుకి సంబంధించి 2007, 2011లలో ఆయన ఎటువంటి పన్ను చెల్లించలేదనే ఆరోపణలు ఆయన్ని చుట్టుముట్టాయి. జెఫ్‌తో పాటు టెస్లా కంపెనీ ఫౌండర్‌ ఎలన్‌మాస్క్‌ 2018లో ఇదే తీరుగా వ్యవహరించారని తాజా రిపోర్టులు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు బ్లూంబర్గ్‌ ఫౌండర్‌ మైఖేల్‌ బ్లూంబర్గ్‌, ఇన్వెస్టర్లు కార్ల్‌, జార్జ్‌ సోరోస్‌లు సైతం పన్ను తక్కువగా చెల్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ 2014 నుంచి 2018 వరకు రికార్డు స్థాయిలో 24.3 బిలియన్ల ఆదాయం సంపాదిస్తే ఆదాయపు పన్నుగా కేవలం 23.7 మిలియన్‌ డాలర్లు చెల్లించారు.

డేటా లీక్‌
ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) రికార్డుల నుంచి సేకరించిన సమాచారంతో ఓ కథనాన్ని ప్రోపబ్లికా సంస్థ రిపోర్టు చేసింది. ఆ వెంటనే అమెరికాలో ఈ వార్తలు పెను దుమారం రేపాయి. దీంతో సంస్థకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు ఎలా పొక్కిందనే అంశంపై విచారణ చేపడతున్నట్టు ఐఆర్‌ఎస్‌ కమిషనర్‌ ఛార్లెస్‌ రెట్టింగ్‌ ప్రకటించారు. టాక్స్‌ పేయర్స్‌ డాటాను కాపాడటం ఐఆర్‌ఎస్‌ బాధ్యతని సెనేట్‌ ఫైనాన్స్‌ కమిటీ చైర్మన్‌ రోన్‌వైడేన్‌ అన్నారు. అదే సమయంలో దేశంలోనే అత్యంత సంపన్నులు తమ వంతు పన్ను చెల్లించలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

చదవండి: టెక్ బిలియనీర్ చిలిపితనం.. ‘అడల్ట్’​ అదృష్టం 

మరిన్ని వార్తలు