ఉండేందుకైనా, అద్దెకైనా అవే కావాలి.. ఆ ఇళ్లకు బీభత్సమైన డిమాండ్‌!

31 Dec, 2022 19:58 IST|Sakshi

56% మంది ఈ గృహాల కోసమే శోధన

71 శాతం మంది అపార్ట్‌మెంట్లకే మొగ్గు

25 శాతం మంది వ్యక్తిగత గృహాలు, విల్లాలపై ఆసక్తి

‘హౌసింగ్‌ సెర్చ్‌–2022’ విడుదల చేసిన మ్యాజిక్‌ బ్రిక్స్‌

సాక్షి, హైదరాబాద్‌: సొంతంగా ఉండేందుకైనా, అద్దెకు ఇవ్వడానికైనా మూడు పడక గదుల గృహాలకే నగరవాసులు జై కొట్టారు. అత్యధికంగా 56 శాతం మంది గ్రేటర్‌వాసులు 3 బీహెచ్‌కే, ఆపై ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 41 శాతం మంది మాత్రం 2 బీహెచ్‌కే మొగ్గుచూపించారు.

3 శాతం మంది సింగిల్‌ బెడ్‌రూమ్‌ కోసం శోధించారని మ్యాజిక్‌ బ్రిక్స్‌ ‘హోమ్‌ సెర్చ్‌–2022’ సర్వే వెల్లడించింది. 71% మంది గృహ కొనుగోలుదారులు బహుళ అంతస్తుల భవనాల కోసం శోధించగా.. 25 శాతం మంది మాత్రం వ్యక్తిగత గృహాలు, విల్లాల కొనుగోలుకు ఆసక్తి చూపించారు.  

► 41 శాతం మంది 1,000 చదరపు అడుగులు (చ.అ.) నుంచి 1,500 చ.అ. మధ్య విస్తీర్ణం ఉండే గృహాలకు జై కొట్టారు. 23 శాతం మంది రూ.50–75 లక్షల మధ్య ధర ఉండే ప్రాపర్టీల కోసం వెతకగా.. 20 శాతం మంది మాత్రం రూ.25–50 లక్షల మధ్య ధర ఉండే గృహాల కోసం పరిశోధన చేశారు.

4వ స్థానం.. 
దేశంలోని ప్రధాన నగరాలలో నిర్వహించిన సర్వేలో చూస్తే.. 2022లో గృహ కొనుగోలుదారులను ఆకర్షించిన నగరాల జాబితాలో హైదరాబాద్‌ నాల్గో స్థానంలో నిలిచింది. తొలి బెంగళూరు, ఆ తర్వాత ముంబై, పుణే నగరాలు నిలిచాయి. 80 శాతం మంది అపార్ట్‌మెంట్లకే మొగ్గు చూపించారు. అయితే ఈ డిమాండ్‌ 2021లో 67 శాతం, 2020లో 57 శాతంగా ఉంది. 

అత్యధికంగా 35 శాతం మంది రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉండే గృహాల కొనుగోలుకు ఆసక్తి చూపించగా.. 25 శాతం మంది రూ.1–2 కోట్లు, 16 శాతం మంది రూ.2 కోట్లపైన, 19 శాతం మంది రూ.25–50 లక్షల మధ్య, 5 శాతం మంది రూ.25 లక్షల లోపు ధర ఉన్న ఇళ్లకు మొగ్గు చూపించారు. అయితే అద్దెకు ఇవ్వడానికైతే 26 శాతం 2 బీహెచ్‌కే యూనిట్లకు, 35 శాతం మంది 3 బీహెచ్‌కే, 19 శాతం సింగిల్‌ బెడ్‌రూమ్‌లకు జై కొట్టారు.

ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్‌.. 
ప్రధానంగా కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, బీరంగూడ ప్రాంతాలలో గృహాల కొనుగోలు కోసం నగరవాసులు తెగ పరిశోధన చేశారు. ఇక అద్దెల కోసం అయితే పశ్చిమ హైదరాబాదే నగరవాసుల మోస్ట్‌ హాట్‌ డెస్టినేషన్‌గా నిలిచింది. ప్రధానంగా గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, మాదాపూర్‌ ప్రాంతాలలోని గృహాలను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల అద్దె కోసం యజమానులు ఆసక్తి చూపించారు.

చదవండి: అయ్యో.. ఎలన్‌ మస్క్‌! సంచలన పతనం.. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని నష్టం!


  

మరిన్ని వార్తలు