కొత్త వెర్షన్‌లో సిద్దమవుతున్న 'హ్యుందాయ్ ఐ10 నియోస్'.. ప్రత్యర్థులకు ఇక గట్టి పోటీనే!

28 Nov, 2022 19:58 IST|Sakshi

భారతీయ ఆటోమొబైల్‌ రంగంలో ప్రముఖ కార్ల కంపెనీ 'హ్యుందాయ్' (Hyundai) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ కంపెనీ లాంచ్‌ చేసిన 'ఐ10' మోడల్‌ కారు ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతూ ఉంది. అయితే ఆ తరువాత ఐ10 నియోస్ పుట్టుకొచ్చింది, కాగా ఇప్పుడు 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' రావడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఇటీవల కెమెరాకి చిక్కాయి. హ్యుందాయ్ నుంచి రానున్న 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం..

గత కొన్ని సంవత్సరాలు హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావడానికి శ్రమిస్తూనే ఉంది, అయితే ఇప్పటికి ఆ కల నిజమయ్యే సమయం వచ్చేసింది. ఇటీవల ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కనిపించింది. అయితే ఈ వెర్షన్ టెస్టింగ్ సమయంలో చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌కు సమీపంలో కనిపించింది. కావున దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్‌ను గుర్తుకు తెస్తుంది.

కొత్తగా రానున్న ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ ముందు మరియు వెనుక చాలా వరకు కప్పబడి ఉండటం వల్ల ఖచ్చితమైన డిజైన్ వెల్లడి కాలేదు. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్ కేసింగ్ డిజైన్ వంటివి మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా కొంత అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. 

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. రియాక్ర్ ప్రొఫైల్లో రిఫ్రెష్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, రాబోయే 2023 ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో అందుబాటులో ఉన్న 8 ఇంచెస్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కలిగి ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్‌ హ్యుందాయ్‌ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.

చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా!

మరిన్ని వార్తలు