7.2 శాతం వృద్ధికే ఇక్రా ఓటు

29 Sep, 2022 06:32 IST|Sakshi

2022–23 జీడీపీ అంచనాలు కొనసాగింపు

మూలధన వ్యయాలు పుంజుకుంటాయని అంచనా

ముంబై: ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు, కాంటాక్ట్‌ సేవలు పుంజుకోవడం సానుకూలతలుగా పేర్కొంది. నిలిచిన డిమాండ్‌ కూడా తోడు కావడంతో వృద్ధి కరోనా ముందు నాటికి స్థాయికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్‌–జూన్‌ (క్యూ1) త్రైమాసికంలో దేశ జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడగా, సెప్టెంబర్‌ త్రైమాసికంలో దీనికంటే తగ్గుతుందని, తదుపరి రెండు త్రైమాసికాల్లోనూ ఇంకాస్త తక్కువ వృద్ధిని చూస్తుందని తెలిపింది.

ఎక్కువ రేటింగ్‌ ఏజెన్సీలు జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం, అంతకంటే దిగువకు ప్రకటించడం గమనార్హం. ఈ రకంగా చూస్తే ఇక్రా వృద్ధి అంచనాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆగస్ట్‌ నెలలో రోజువారీ రికార్డు స్థాయి జీఎస్‌టీ ఈవే బిల్లుల జారీ, పండుగలకు ముందస్తు భారీగా ఉత్పత్తుల నిల్వలను పెంచుకోవడం, కమోడిటీ ధరలు క్షీణించడం రానున్న పండుగల సీజన్‌కు ఎంతో సానుకూలమని.. అయితే, ఖరీఫ్‌లో కీలకమైన వరి దిగుబడి తగ్గనుండడం, వెలుపలి డిమాండ్‌ బలహీనపడడం వృద్ధికి ఉన్న సవాళ్లు అని, వీటిని పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

త్రైమాసికం వారీగా..
‘‘సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5–7 శాతానికి పరిమితం కావచ్చు. డిసెంబర్‌ త్రైమాసికం (క్యూ3), 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ4)లో 5–5.5 శాతంగా ఉండొచ్చు. బేస్‌ ప్రభావం వల్లే ఇలా ఉంటుంది’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు.  2022 చివరికి ప్రైవేటు రంగంలో పూర్తి స్థాయిలో మూలధన వ్యయాలు పుంజుకుంటాయని, కంపెనీల తయారీ సామర్థ్య వినియోగం పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీవీఏ 7 శాతంగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 10.1 శాతంగా, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతం (మూడు రెట్లు పెరిగి 120 బిలియన్‌ డాలర్లు) ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్‌ బలంగా ఉండడంతో, దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటు విస్తరిస్తుందని అభిప్రాయపడింది. రూపాయి మరీ దారుణ పరిస్థితుల్లో డిసెంబర్‌ నాటికి డాలర్‌తో 83కు పడిపోవచ్చని, పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్‌ 7.3–7.8 శాతం స్థాయిలో ఉంటాయని అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటు 15.87 లక్షల కోట్లు (జీడీపీలో 6.7 శాతం) ఉంటుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు