భారత్‌ నుంచి ఎగుమతుల్లో సముచిత వృద్ధి!

13 Jul, 2022 09:29 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి ఎగుమతులు ‘సముచిత స్థాయిలో‘ వృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. బడా ఎగుమతిదారులు, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిళ్లతో సమాలోచనలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు పరిణామాలను సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు.

 ‘ధర, నాణ్యతపరంగా మన ఎగుమతులకు ప్రత్యేకత ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి ఎగుమతుల అంచనాలు ఉంటాయి‘ అని గోయల్‌ చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 2022–23లో 450–500 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యపడేదేనా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యమేదీ విధించుకోలేదని ఆయన పేర్కొన్నారు. నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీపీ)పై స్పందిస్తూ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. 

అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో ప్రస్తుత పాలసీని ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉత్పత్తుల ఎగుమతులు 17 శాతం పెరిగి 37.94 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి, క్రూడాయిల్‌ దిగుమతులు భారీగా పెరగడంతో కరెంటు అకౌంటు లోటు 25.63 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది.    

మరిన్ని వార్తలు