భారత్‌ ఎకానమీ మరింత పతనం

2 Sep, 2020 08:31 IST|Sakshi

2020–21లో మైనస్‌ 10.9% క్షీణత!

క్రితం అంచనా మైనస్‌ 6.8 శాతం

ఎస్‌బీఐ ఎకోర్యాప్‌ నివేదిక అంచనా

ముంబై: భారత 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో క్షీణ రేటు అంచనాలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా నివేదిక– ఎకోర్యాప్‌ మరింత పెంచింది. ఇప్పటి వరకూ ఈ అంచనా మైనస్‌ 6.8 శాతం అయితే ఇది మైనస్‌ 10.9 శాతం కింది వరకూ పోయే వీలుందని తాజా అంచనాల్లో పేర్కొంది. సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం, మొదటి త్రైమాసిక జీడీపీ భారీగా మైనస్‌ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో తన వార్షిక ఎకానమీ అంచనాలకు సైతం మైనస్‌ 6.8 శాతం నుంచి తాజాగా మైనస్‌ 10.9 శాతానికి పెంచడం గమనార్హం. నివేదికలోని కొన్ని అంచనాలు, ముఖ్యాంశాలు చూస్తే.. (బంగారం- వెండి.. మూడో రోజూ దూకుడు)

 రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌) ఆర్థిక వ్యవస్థ మైనస్‌ 12 శాతం నుంచి మైనస్‌ 15 శాతం వరకూ క్షీణిస్తుంది.
► మూడవ త్రైమాసికం (అక్టోబర్‌–డిసెంబర్‌) ఈ పరిమాణం మైనస్‌ 5 శాతం నుంచి మైనస్‌ 10 శాతం వరకూ ఉంటుంది.
► నాల్గవ త్రైమాసికం (జనవరి–మార్చి)లో ఈ క్షీణ రేటు మైనస్‌ 2 శాతం నుంచి మైనస్‌ 5 శాతం వరకూ ఉంటుంది.
► మొదటి త్రైమాసికంలో భారీ క్షీణతకు కరోనా వైరస్‌ కారణమైనా, క్షీణత మరీ ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు.
► ప్రైవేటు వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) వృద్ధి రేటు భారీగా పడిపోయింది. విద్య, ఆరోగ్య రంగాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.
► పెట్టుబడుల డిమాండ్‌లో రికవరీ కనిపించడం లేదు. ఈ విభాగంలో క్షీణత 14 శాతం ఉంటుందని భావిస్తున్నాం.
► నిర్మాణం, ట్రేడ్‌ అండ్‌ హోటెల్స్, విమానయాన రంగాల పునరుద్ధరణ జరగాల్సి ఉంది.
► రవాణా సేవల పునరుద్ధరణ, మౌలికరంగంలో వ్యయాలు పెరగాల్సి ఉంది.

ఊరటకలిగిస్తున్న అంశాలు రెండు...
తీవ్ర ప్రతికూలతలోనూ రెండు సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒక అంశం చూస్తే– జూలైకి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రుణ వృద్ధి కనబడింది. వ్యక్తిగత రుణాల విషయంలోనూ ఇదే ధోరణి ఉంది. ఇక రెండవ సానుకూల విషయానికి వస్తే, మొదటి త్రైమాసికంలో కేంద్రం ప్రకటించిన కొన్ని కీలక ప్రాజెక్టులకు ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. రహదారులు, విద్యుత్‌తో పాటు ఆసుపత్రుల వంటి కమ్యూనిటీ సేవల ప్రాజెక్టులూ ఇందులో ఉన్నాయి. (మున్ముందు అన్నీ మంచి రోజులే!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా