స్మార్ట్‌ఫోన్లకు గ్రామాల దన్ను! 

23 Feb, 2022 00:26 IST|Sakshi

2026 నాటికి 100 కోట్లకు చేరనున్న యూజర్ల సంఖ్య 

ఫైబర్‌ ప్రాజెక్టు, 5జీ ఊతం 

డెలాయిట్‌ నివేదికలో వెల్లడి 

న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలకు గ్రామీణ ప్రాంతాలు దన్నుగా నిలుస్తున్నాయి. దీనితో వచ్చే అయిదేళ్లలో స్మార్ట్‌ఫోన్‌ల యూజర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021 గణాంకాల ప్రకారం దేశీయంగా 120 కోట్ల మొబైల్‌ యూజర్లు ఉండగా.. వీరిలో 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఉన్నారు. వచ్చే అయిదేళ్లలో భారత్‌ ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు తయారు చేసే రెండో దేశంగా నిలవనుంది.

ఈ నేపథ్యంలోనే డెలాయిట్‌ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ 2026 నాటికి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 1 బిలియన్‌ (100 కోట్లు) యూజర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది‘ అని 2022 గ్లోబల్‌ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా.. వినోదం, టెలికం) అంచనాల పేరిట రూపొందించిన నివేదికలో డెలాయిట్‌ తెలిపింది. దీని ప్రకారం 2021–26 మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం వార్షిక వృద్ధి రేటు పట్టణ ప్రాంతాల్లో 2.5 శాతంగా ఉండనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 6 శాతం స్థాయిలో నమోదు కానుంది.  ‘ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ స్మార్ట్‌ఫోన్లకు కూడా డిమాండ్‌ పెరగవచ్చు.

ఫిన్‌టెక్, ఈ–హెల్త్, ఈ–లెరి్నంగ్‌ మొదలైన అవసరాల రీత్యా ఈ మేరకు డిమాండ్‌ నెలకొనవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. భారత్‌నెట్‌ ప్రోగ్రాం కింద 2025 నాటికల్లా అన్ని గ్రామాలకు ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ప్రణాళిక కూడా గ్రామీణ మార్కెట్‌లో ఇంటర్నెట్‌ ఆధారిత డివైజ్‌ల డిమాండ్‌కు దోహదపడగలదని వివరించింది. 

కొత్త ఫోన్లకే మొగ్గు.. 
2026 నాటికి పట్టణ ప్రాంతాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లను కొనే వారి సంఖ్య 5 శాతానికే పరిమితం కావచ్చని 95 శాతం మంది తమ పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనుక్కునేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని డెలాయిట్‌ నివేదికలో తెలిపింది. 2021లో ఇలా తమ పాత ఫోన్ల స్థానంలో ప్రీ–ఓన్డ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనేవారు 25 శాతంగా ఉండగా.. కొత్త వాటిని ఎంచుకునే వారి సంఖ్య 75 శాతంగా నమోదైంది.

ఫోన్‌ సగటు జీవితకాలం దాదాపు నాలుగేళ్లుగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధోరణి కనిపించనుంది. 2026లో ఆయా ప్రాంతాల్లో రీప్లేస్‌మెంట్‌లకు సంబంధించి 80 శాతం వాటా కొత్త ఫోన్లది ఉండనుండగా.. మిగతా 20 శాతం వాటా సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లది ఉండనుంది. ఇక స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ ఫీచర్‌ ఫోన్ల స్థానంలో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడం కూడా తగ్గనుంది. 2021లో ఫీచర్‌ ఫోన్‌ రీప్లేస్‌మెంట్‌ .. పట్టణ ప్రాంతాల్లో 7.2 కోట్లుగా ఉండగా 2026లో ఇది 6 కోట్లకు తగ్గనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో 7.1 కోట్ల నుంచి 6 కోట్లకు దిగి రానుంది. 

5జీతో పెరగనున్న డిమాండ్‌ .. 
డెలాయిట్‌ అధ్యయనం ప్రకారం భారత్‌లో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ 6 శాతం మేర వార్షిక వృద్ధితో 2026 నాటికి 40 కోట్లకు చేరనుంది. 2021లో ఇది 30 కోట్లుగా ఉంది. 5జీ సర్వీసుల కారణంగా స్మార్ట్‌ఫోన్లకు ప్రధానంగా డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు 80 శాతం అమ్మకాలకు (సుమారు 31 కోట్ల యూనిట్లు) ఇదే ఊతంగా నిలవనుంది. హై–స్పీడ్‌ గేమింగ్, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించడం వంటి వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడే 5జీ టెక్నాలజీ.. మిగతా మొబైల్‌ సాంకేతికలతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉందని డెలాయిట్‌ తెలిపింది.

ఒక్కసారి 5జీ సర్వీసులను ఆవిష్కరిస్తే .. 2026 నాటికి స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు మొత్తం మీద అదనంగా 13.5 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. ‘2022–26 మధ్య కాలంలో మొత్తం స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనితో ఈ మార్కెట్‌ 250 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. అయిదేళ్ల వ్యవధిలో 84 కోట్ల పైచిలుకు 5జీ పరికరాలు అమ్ముడు కానున్నాయి‘ అని డెలాయిట్‌ వివరించింది.

మరోవైపు, మీడియా విషయానికొస్తే.. కొరియన్, స్పానిష్‌ వంటి అంతర్జాతీయ కంటెంట్‌కు భారత్‌లో ప్రాచుర్యం పెరుగుతోందని తెలిపింది. దీంతో పలు స్ట్రీమింగ్‌ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని పేర్కొంది. తమ కస్టమర్లను కాపాడుకునే క్రమంలో స్ట్రీమింగ్‌ సర్వీసుల కంపెనీలు.. రేట్ల విషయంలో పోటీపడే అవకాశం ఉంటుందని తెలిపింది.  

తగ్గనున్న చిప్‌ల కొరత.. 
సెమీకండక్టర్‌ చిప్‌ల కొరతతో ప్రపంచవ్యాప్తంగా తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని డెలాయిట్‌ తెలిపింది. సమీప కాలంలో డిమాండ్‌ పెరిగే కొద్దీ సరఫరాపరమైన పరిమితులు కొనసాగవచ్చని.. 2023లో క్రమంగా పరిస్థితి మెరుగుపడవచ్చని పేర్కొంది.

మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్‌ తయారీలో భారత్‌ ప్రాంతీయంగా పటిష్టమైన హబ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ పీఎన్‌ సుదర్శన్‌ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం .. ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు