బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..

27 Aug, 2023 15:44 IST|Sakshi

India additional safeguards on basmati rice: బాస్మతి ముసుగులో నిషేధిత సాధారణ బియ్యం ఎగుమతులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటి కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిషేధిత కేటగిరీ కింద ఉన్న బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిరోధించడానికి బాస్మతి బియ్యం ఎగుమతులపై అదనపు భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది.

బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని తప్పుగా వర్గీకరించి అక్రమ ఎగుమతి చేస్తున్నట్లు విశ్వసనీయ క్షేత్ర నివేదికలు అందినట్లు ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. బాస్మతియేతర తెల్ల బియ్యాన్ని హెచ్ఎస్ కోడ్స్ ఆఫ్ పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొంది. 

దేశీయంగా ధరలను కట్టడి చేయడానికి, ఆహార భద్రత కోసం గత జులై 20 నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై పరిమితులు విధించినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గమనించింది.

బాస్మతీ బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమంగా ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA)కి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లోకేషన్‌ సర్టిఫికేట్ (RCAC) జారీకి నమోదు చేయాలని ఏపీఈడీఏకి ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్రులను నిలిపేయవచ్చని, అలాగే వాటి పరిశీలనకు ఏపీఈడీఏ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయవచ్చని సూచనలు చేసింది.

ఇదీ చదవండి: రేట్లు పెంచాల్సి ఉంటుంది.. ఆర్బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు