ఇండియన్‌ బ్యాంక్‌ లాభం జూమ్‌

20 Jul, 2021 04:54 IST|Sakshi

క్యూ1లో రూ. 1,182 కోట్లు

న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 220 శాతం దూసుకెళ్లి రూ. 1,182 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 369 కోట్ల స్టాండెలోన్‌ లాభం ఆర్జించింది. 2020 ఏప్రిల్‌ 1నుంచి అలహాబాద్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకుంది. వ్యయాల నియంత్రణ, వడ్డీ, వడ్డీయేతర ఆదాయంలో వృద్ధి వంటి అంశాలు లాభదాయకతకు దోహదం చేసినట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో పద్మజ చుండూరు పేర్కొన్నారు. చౌకలో నిధుల సమీకరణకు విలీనం సహకరించినట్లు తెలియజేశారు.  

మార్జిన్లు అప్‌
నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పుంజుకుని రూ. 3,994 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం మాత్రం 41 శాతం ఎగసి రూ. 1,877 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.51 శాతం బలపడి 2.85 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 10.9 శాతం నుంచి 9.69%కి మెరుగుపడ్డాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.76% నుంచి 3.47%కి తగ్గాయి. తాజా స్లిప్పేజెస్‌ రూ. 4,204 కోట్లుగా నమోదయ్యాయి. నగదు రికవరీ రూ. 657 కోట్లకు చేరగా.. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 2,290 కోట్లను తాకాయి.
ఫలితాల నేపథ్యంలో ఇండియన్‌ బ్యాంక్‌ షేరు 0.6% పుంజుకుని రూ. 139 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు