బలహీన రూపాయితో భారత్‌ కంపెనీలు బేఫికర్‌

30 Nov, 2022 04:38 IST|Sakshi

మూడీస్‌ ఇన్వెస్ట్‌ర్స్‌ సర్వీస్‌ విశ్లేషణ  

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో  పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు వంటి అంతర్జాతీయ సవాళ్లు కరెన్సీ అస్థిరతను పెంచుతాయని  మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ మంగళవారం తెలిపింది. అయితే దేశంలోని పలు రేటింగ్‌ కంపెనీలు బలహీనమైన రూపాయిని తట్టుకోగలిగిన పరిస్థితిని కలిగిఉన్నాయని విశ్లేషించింది. ఏడాది ప్రారంభం నుంచి డాలర్‌ మారకంలో రూపాయి విలువ  దాదాపు 10 శాతం క్షీణించింది. అక్టోబర్‌ 19న  అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది.

అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్‌ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన ధోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. ఈ నేపథ్యంలో మూడీస్‌ తాజా నివేదికలో  మరికొన్ని ముఖ్యాంశాలు..

► అధిక ఇంధన ధరలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల స్థిరమైన పెరుగుదల వంటి అంశాలు భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ (దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతాయి. ఇది రూపాయిపైనా ఒత్తిడిని          పెంచుతుంది.  

► అయితే ఈ తరహా అంతర్జాతీయ సవాళ్లను దేశ కరెన్సీ ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలోని చాలా రేటెడ్‌ కంపెనీలు రూపాయి క్షీణతను తట్టుకునే బఫర్‌లను కలిగి ఉన్నాయి.  

► రూపాయి క్షీణించడం దేశీయ కరెన్సీలో ఆదాయాన్ని ఆర్జించే భారతీయ కంపెనీలకు క్రెడిట్‌ ప్రతికూలమే.  అయితే ఆయా కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన  నిధుల విషయంలో డాలర్‌ రుణ నిష్పత్తి ఎంతుందన్న విషయంపై ఇది  ఆధారపడి ఉంటుంది.

► పలు అంశాల విశ్లేషణల అనంతరం, రేటింగ్‌ పొందిన కంపెనీలకు ప్రతికూల క్రెడిట్‌ చిక్కులు పరిమితంగా లేదా తాత్కాలికంగా ఉంటాయని మేము భావిస్తున్నాం.  

► చాలా రేటెడ్‌ కంపెనీలు కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పరిమితం చేయడానికి తగిన రక్షణలను (హెడ్జింగ్‌ సౌలభ్యాలు) కలిగి ఉన్నాయి. రూపాయి తీవ్ర పతన సమయాల్లోనూ ఈ ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడంలో ఇవి దోహదపడతాయి.  

► భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది.  విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదు.  

► రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు.  

► భారత్‌ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదు. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయి. రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయి.  ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి.   

► మంచి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవ త్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా  6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం  అవుతుందని భావిస్తున్నాం.  

భారత్‌కు మూడీస్‌ రేటింగ్‌ ఇలా...
మూడీస్‌ గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్‌ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్‌ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి కుదించింది.

   ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం.  తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్‌ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది.  2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్‌ అంచనా.  2021 క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ వృద్ధి 8.5 శాతమని మూడీస్‌ పేర్కొంది.  

మరిన్ని వార్తలు