జోరందుకున్న కార్పొరేట్‌ ఆదాయాలు

19 Oct, 2023 07:58 IST|Sakshi

క్యూ2లో 8–10 శాతం ప్లస్‌

మెరుగుపడిన లాభాల మార్జిన్లు

రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ నివేదిక

ముంబై: దేశీ కార్పొరేట్‌ ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో జోరందుకున్నట్లు రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ ఒక నివేదికలో పేర్కొంది. 8–10 శాతం మధ్య టర్నోవర్‌ పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో జులై–సెప్టెంబర్‌(క్యూ)లో లాభాల మార్జిన్లు సైతం మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. గత నాలుగు త్రైమాసికాలతో పోలిస్తే తొలిసారి దేశీ కంపెనీల ఆదాయాల్లో పటిష్ట వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడించింది.

ఆటోమొబైల్స్, కన్‌స్ట్రక్షన్, ఐటీ రంగాలు టర్నోవర్‌లో వృద్ధికి దోహదపడుతున్నట్లు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో ఆదాయం 7 శాతం బలపడినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్, చమురు రంగాలను మినహాయించి 300 కంపెనీలను తాజా నివేదికలో విశ్లేషించినట్లు క్రిసిల్‌ వెల్లడించింది.  

ఆటో, రిటైల్‌ జోరు 
నివేదిక ప్రకారం వినియోగదారు విచక్షణానుగుణ(కన్జూమర్‌ డిస్‌క్రెషనరీ) ప్రొడక్టులు, సర్వీసులవైపు దేశీ కార్పొరేట్‌ ఆదాయాల్లో వృద్ధి ప్రయాణించింది. ప్రధానంగా ఆటోమొబైల్, రిటైల్‌ రంగాలు ప్రధానపాత్ర పోషించగా.. నిర్మాణ సంబంధ విభాగాలు సైతం జత కలిశాయి. రహదారులు, రైల్వే శాఖల పెట్టుబడుల ముందస్తు కేటాయింపులలతో నిర్మాణ రంగ కంపెనీలు లబ్ది పొందినట్లు క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ అనికెట్‌ డాని పేర్కొన్నారు.

అయితే వ్యవసాయ రంగంతో ముడిపడిన ఎరువులు, క్లోర్‌ ఆల్కలీస్, పెట్రోకెమికల్స్, కమోడిటీ కెమికల్స్, అల్యూమినియం తదితర ఇండస్ట్రియల్‌ కమోడిటీలు నీరసించకుంటే కార్పొరేట్‌ ఆదాయాలు మరింత జోరు చూపేవని నివేదిక అభిప్రాయపడింది. మొత్తం ఆదాయంలో 70 శాతానికి ప్రాతినిధ్యంవహించే 9 రంగాలు వృద్ధిని అందుకుంటున్నాయని వివరించింది.

ఇక లాభాల విషయంలో నిర్వహణ లాభ మార్జిన్లు గతేడాది(2022–23) రెండో త్రైమాసికంలో నమోదైన 17.2 శాతంతో పోలిస్తే 20 శాతానికి మెరుగుపడినట్లు తెలియజేసింది. క్యూ1లో ఇవి 20.5 శాతంకాగా.. త్రైమాసికవారీగా స్వల్ప వెనకడుగు వేసినట్లు పేర్కొంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, వర్షాభావం వంటి అంశాలు ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్‌–మార్చి)లో గ్రామీ ణ ప్రాంతాల డిమాండును ప్రభావితం చేయవచ్చని అంచనా వేసింది.

మరిన్ని వార్తలు