మీడియా, వినోదం ఆదాయం 1.6 లక్షల కోట్లు!

4 Jan, 2023 08:59 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ మీడియా, వినోద రంగం ఆదాయాలు మార్చితో ప్రారంభమయ్యే 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 నుంచి 14 శాతం వృద్ధితో రూ. 1.6 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఆదాయాల వృద్ధి స్పీడ్‌ విషయంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ తొలి వరుసలో నిలిస్తే, టీవీ, ప్రింట్‌లు వరుసలో తరువాత ఉండనున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. 

మీడియా, వినోద రంగం ఆదాయంలో 55 శాతం వాటా ప్రకటన విభాగం నుంచి రాబడికి సంబంధించినదే.  ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉండడంతో ఈ విభాగంలో ఆదాయాలు 14 శాతం వృద్ధి చెందుతాయని అంచనా.  అలాగే, 2024 మధ్యలో జరిగే సాధారణ ఎన్నికలు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రకటన వ్యయంలో పెరుగుదలను పెంచుతాయి.  

 మిగిలిన 45 శాతం చందాల రూపంలో ఉంటుంది. ఈ విభాగంలో వృద్ధి 12 శాతం వరకూ నమోదుకావచ్చు.  

వేర్వేరుగా చూస్తే, ప్రింట్‌ మీడియాలో ఆదాయాలు 15 శాతం పెరిగే వీలుంది. అయితే ఈ విభాగంలో ఆదాయాలు ఇంకా కరోనా ముందస్తు స్థాయికి చేరలేదు. ఇంకా ఈ విషయంలో ఆదాయాలు ఇంకా 8 నుంచి 10 శాతం వరకూ వెనుకబడి ఉన్నాయి. ఆంగ్ల ఎడిషన్ల విషయంలో ఆదాయాల రికవరీ నెమ్మదిగా ఉండడం దీనికి కారణం. అయితే రేడియో, అవుట్‌డోర్‌ వంటి ఇతర హైపర్‌లోకల్‌ మీడియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరోనా ముందస్తు స్థాయిలను చేరుకోవచ్చు. ఈ విభాగాలకు కీలకమైన వనరుగా ఉన్న సూక్ష్మ, చిన్న,  మధ్య తరహా  సంస్థల కోసం అధిక యాడ్‌ బడ్జెట్‌ కేటాయింపులు దీనికి కారణం.  

ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ విషయానికి వస్తే, థియేటర్‌ వసూళ్లు కోవిడ్‌–19 వల్ల తీవ్రంగా నష్టపోయాయి. అయితే 2023–24లో పటిష్టంగా ఆయా ఆదాయాఉల రికవరీ సాధించవచ్చు.30 శాతం వరకూ గణనీయమైన వృద్ధి రేటు నమోదవుతుందని భావిస్తున్నాం. స్క్రీన్లు, ఆక్యుపెన్సీ రేటు పెరిగే అవకాశాలు ఉండడం మా అంచనాలకు కారణం.  

టీవీ, ప్రింట్‌ మీడియాల్లో రాబడుల్లో వృద్ధి స్పీడ్‌ మామూలుగా నమోదుకావచ్చు. దీర్ఘకాలికంగా డిజిటల్‌ మాధ్యమానికి ప్రాధాన్యత పెరుగుతుండడమే దీనికి కారణం.   

మరిన్ని వార్తలు