దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌

31 Jan, 2023 10:51 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. తాజాగా ఏవియేషన్‌ గ్యాస్‌ (ఏవీ గ్యాస్‌) ఎగుమతులు ప్రారంభించింది. 80 బ్యారెళ్ల తొలి కన్సైన్‌మెంట్‌ను (ఒక్కో బ్యారెల్‌ 16 కిలోలీటర్లు) జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌ నుంచి పపువా న్యూ గినియాకు పంపినట్లు సంస్థ తెలిపింది. నికరంగా ఇంధనాలను దిగుమతి చేసుకునే భారత్‌ .. ఇలా ఏవీ గ్యాస్‌ను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం. దీనితో అంతర్జాతీయంగా 2.7 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న ఏవీ గ్యాస్‌ మార్కెట్లోకి ప్రవేశించినట్లు సంస్థ తెలిపింది.

మానవరహిత ఏరియల్‌ వాహనాలు (యూఏవీ), ఫ్లయింగ్‌ స్కూల్స్‌ నడిపే చిన్న విమానాలు మొదలైన వాటిల్లో ఏవీ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. పెద్ద వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)గా వ్యవహరిస్తారు. ఏవీ గ్యాస్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ మారకం ఆదా కావడంతో పాటు ఔత్సాహిక పైలట్లకు ఫ్లయింగ్‌ స్కూల్స్‌లో శిక్షణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఐవోసీ చైర్మన్‌ ఎస్‌ఎం వైద్య చెప్పారు. అలాగే రక్షణ బలగాలు ఉపయోగించే యూఏవీల నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గగలవని పేర్కొన్నారు. దీన్ని దేశీయంగా ఐవోసీ మాత్రమే తయారు చేస్తోంది. గుజరాత్‌లోని వడోదరలో గత సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు సామర్థ్యం 5,000 టన్నులుగా ఉంది.

చదవండి: ఆ జాబ్‌ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్‌:  7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్‌ స్టోరీ

మరిన్ని వార్తలు