Stock Market: రెండురోజుల్లో రూ.6.47 లక్షల కోట్లు మాయం!

26 Apr, 2022 11:17 IST|Sakshi

ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్‌ రెండో రోజూ వెనకడుగు వేసింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రెండున్నర శాతం క్షీణించింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం సెన్సెక్స్‌ 617 పాయింట్లు క్షీణించి 57 వేల స్థాయిని కోల్పోయి 56,580 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, నెస్లే, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌ టెల్, యాక్సిస్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయి ఐదు వారాల తర్వాత తొలిసారి 17 వేల దిగువన 16,954 వద్ద నిలిచింది. ఇటీవల కరెక్షన్‌లోనూ రాణించిన మెటల్‌ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. విస్తృత మార్కెట్లోనూ చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు రెండుశాతం క్షీణించాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 22 పైసలు బలహీనపడి 76.64  వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,303 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ. 1,870 కోట్ల షేర్లను కొన్నారు.  

ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు  
చైనా రాజధాని బీజింగ్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్‌ కట్టడికి పలు ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ఆసియాలో చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, జపాన్, సింగపూర్‌ దక్షిణ కొరియా, ఇండోనేసియాలతో సహా ప్రధాన మార్కెట్లన్నీ ఐదు శాతం మేర  నష్టపోయాయి. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం రెండునెలలైనా ఆగలేదు. యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో కఠినతర ద్రవ్య విధానాలను అవలంబించాలని ఈసీబీ నిర్ణయించుకుంది. ఫలితంగా యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ స్టాక్‌ సూచీలు రెండుశాతం క్షీణించాయి. ఫెడ్‌ రిజర్వ్‌ ఈ మేనెలలో వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడంతో పాటు అవసరమైతే జూన్, జూలైలో కూడా రేట్లను పెంచొచ్చనే సంకేతాలతో అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు రెండు శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. కోవిడ్‌ ప్రేరేపిత లాక్‌డౌన్లతో డిమాండ్‌ తగ్గొచ్చనే అంచనాలతో ఇంట్రాడేలో క్రూడాయిల్‌ ధరలు అనూహ్యంగా పతనాన్ని చూవిచూశాయి. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, క్రూడాయిల్‌ ధరల భగభగలు, సప్లై అవాంతరాలు తదితర ప్రతికూలతలకు తాజాగా నిరాశపూరిత కార్పొరేట్‌ మార్చి ఆర్థిక గణాంకాలు తోడయ్యాయి. ఇండోనేసియా విదేశాలకు పామాయిల్‌ ఎగుమతులను నిషేధించింది. ఈ పరిణామాలూ జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో బలహీనతలను నింపాయి 

ట్రేడింగ్‌ ఆద్యంతం నష్టాల్లోనే...  
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ ఉదయం 440 పాయింట్ల నష్టంతో 56,758 వద్ద, నిఫ్టీ 163 పాయింట్లు క్షీణించి 17,009 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బలహీనంగా ప్రారంభమైన సూచీలు, ఏ దశలోనూ కోలుకోలేదు. పైగా అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లాయి. మిడ్‌సెషన్‌ సమయంలో సెన్సెక్స్‌ 840 పాయింట్లు క్షీణించి 56,356 వద్ద, నిఫ్టీ 283 పాయింట్లు పతనమై 16,889 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే క్రూడాయిల్‌ పతనం నుంచి కొంత సానుకూలతలు అందుకున్న సూచీలు ట్రేడింగ్‌ చివర్లో స్వల్పంగా నష్టాలను తగ్గించుకున్నాయి.  
 
రెండురోజుల్లో రూ.6.47 లక్షల కోట్లు మాయం  
గడిచిన రెండురోజుల్లో సెన్సెక్స్‌ 1,332 పాయింట్ల పతనంతో స్టాక్‌ మార్కెట్లో రూ.6.47 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.265 లక్షల కోట్లుగా దిగివచి్చంది.

మార్కెట్లో మరిన్ని సంగతులు 

రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ రూ.24,713 కోట్ల ఒప్పందం రద్దుతో ఆర్‌ఐఎల్‌తో పాటు ఫ్యూచర్స్‌ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫ్యూచర్‌ కన్జూమర్, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైయిల్‌ ఫ్యాషన్‌ షేర్లు 20 శాతం క్షీణించాయి. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పదిశాతం, ఫ్యూచర్‌ రిటైల్‌ షేరు ఐదు శాతం పతనమైంది. ఫ్యూచర్‌ గ్రూప్‌లోని షేర్లన్నీ లోయర్‌ సర్క్యూట్‌ను తాకి ఫ్రీజ్‌ అయ్యాయి. రిలయన్స్‌ షేరు బీఎస్‌ఈలో రెండున్నర శాతం క్షీణించి రూ.2,695 వద్ద స్థిరపడింది. 

నష్టాల మార్కెట్‌లోనూ ఐసీఐసీఐ బ్యాంకు షేరు రాణించింది. క్యూ4లో కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో  బీఎస్‌ఈలో ఈ షేరు ఒకశాతం లాభపడి రూ.753 వద్ద స్థిరపడింది. ఒక దశలో రెండు శాతం బలపడి రూ.762 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో మొత్తం 8.54 లక్షల షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు