యాహూ.. అంబులెన్స్‌ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!

14 Dec, 2022 19:35 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ గత కొన్నేళ్లుగా యూజర్ల ప్రాణాల్ని కాపాడేలా క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌తో ప్రొడక్ట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్రో, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8, యాపిల్‌ వాచ్‌ ఆల్ట్రాలలో ఈ లేటెస్ట్‌ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆ ఫీచరే ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అదెలా అంటారా?   

రెడ్డిట్ పోస్ట్‌ ప్రకారం..ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ ఫీచర్ భార్య రోడ్డు ప్రమాదానికి గురైందంటూ భర్తను అప్రమత్తం చేసింది. అంతేకాదు యాక్సిడెంట్‌ ఎక్కడ జరిగిందో అడ్రస్‌ చెప్పి భర్తను అలెర్ట్‌ చేయడంతో అంబులెన్స్‌ కంటే ముందే వెళ్లి ఘటన స్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించి ప్రాణం కాపాడుకున్నాడు. ఈ సందర్భంగా  భర్త తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. 

నేను ఆఫీస్‌ పని మీద క్లయింట్‌ను కలిసిందేకు వెళ్తున్నాను. అదే సమయంలో దుకాణం నుంచి ఇంటికి వెళ్తున్న నా భార్య ఫోన్‌ చేస్తే..ఆమెతో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతుండగానే నా భార్య గట్టిగా కేకలు వేసింది. సెకన్ల వ్యవధిలో ఆమె ఫోన్‌ పని చేయడం ఆగిపోయింది. ఏమైందోనని కంగారుగా బయలు దేరుతుండగా అప్పుడే  ఓ మెసేజ్‌ వచ్చింది. మీ భార్యకు యాక్సిడెంట్‌ అయ‍్యింది. ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిందంటూ అడ్రస్‌ సైతం ఆ మెసేజ్‌లో ఉంది. అంబులెన్స్‌ కంటే ముందు ఆ ప్రదేశానికి వెళ్లాను. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి నా భార్యను కాపాడుకోగలిగాను అంటూ రెడ్డిట్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

మరిన్ని వార్తలు