టెస్లా సంగతేమో కానీ.. బెంజ్‌ కారయితే వచ్చేసింది!

8 Oct, 2021 11:57 IST|Sakshi

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌ ఇండియా. ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఉత్సాహపడే కంపెనీలు, ఉబలాటపడే పెట్టుబడిదారులు ఎందరో ? కానీ టెస్లా కంపెనీ, దాని ఓనరు ఎలన్‌ మస్క్‌ తీరే వేరు. ఇండియాకి టెస్లా కార్లు తెచ్చే విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంటుంది అతడి వ్యవహరం. కానీ ఇతర కంపెనీలు భారత్‌ మార్కెట్‌ని తక్కువగా అంచనా వేయడం లేదు. త్వరత్వరగా నిర్ణయాలు తీసుకుని ఇక్కడి ప్రజలకు మరింతగా చేరువ అవుతున్నాయి. అందులో జర్మనీకి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్‌ ముందు వరుసలో ఉంది.

బరిలో దిగిన మెర్సిడెజ్‌ బెంజ్‌
నీతి అయోగ్‌ లెక్కల ప్రకారం ఇండియాలో ప్రతీ వెయ్యి మందిలో కేవలం 22 మందికే కార్లు ఉన్నాయి. దీంతో ఇండియాలో కార్ల మార్కెట్‌కి భారీ అవకాశాలు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ నుంచి లగ్జరీ సెగ్మెంట్‌ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇండియన్‌ మార్కెట్‌లో బలమైన ముద్ర వేసేందుకు జర్మనికి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్‌ రెడీ అయ్యింది. గతేడాది ఆ సంస్థ రిలీజ్‌ చేసిన ఎస్‌ సిరీస్‌ కార్లు ఇండియాలో బాగానే క్లిక్‌ అయ్యాయి. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు రూ. 2,200 కోట్ల వ్యయంతో పూనేలో కార్ల తయారీ యూనిట్‌ని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఏర్పాటు చేసింది. 

టెస్లా తీరు
ఇక టెస్లా విషయానికి వస్తే ఎలక్ట్రిక్‌ కార్లు తయారు చేస్తున్నాం కాబట్టి దిగుమతి సుంకం తగ్గించాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ఇండియాలో తయారీ యూనిట్‌ నెలకొల్పితే ట్యాక్స్‌ మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే టెస్లా దీనిపై నేరుగా స్పందించకుండా.. ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ తగ్గిస్తే ముందుగా ఈవీ కార్ల అమ్మకాలు ప్రారంభిస్తామని, ఆ తర్వాత మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ విషయంలో నిర్ణయం తీసుకుంటాం అనే విధంగా వ్యవహరిస్తోంది. దీంతో టెస్లా కార్లు ఇండియాకు వచ్చే విషయంలో క్లారిటీ రావడం లేదు. 

తగ్గిన ధర
ఇండియాలో​ కార్ల తయారీ యూనిట్‌ నెలకొల్ప కార్ల ఉత్పత్తి ప్రారంభించడంతో కేంద్రం విధించి దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించింది. దీంతో ఒక్కసారిగా బెంజ్‌ కార్ల ధరలు తగ్గిపోయాయి. మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌ 450 4 మ్యాటిక్‌ ధర రూ. 2.19 కోట్ల నుంచి రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. ధర తగ్గిపోవడంతో భవిష్యత్తులో కార్ల అమ్మకాలు పెరుగుతాయని మెర్సిడెజ్‌ బెంజ్‌ భావిస్తోంది.

ఆలస్యం చేస్తే అంతే
ఇండియా లాంటి ఎమర్జింగ్‌ మార్కెట్‌లో పట్టు సాధించాలంటే ఎలన్‌ మస్క్‌ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇండస్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. నాన్చుడు ధోరణి కనబరిస్తే మెర్సిడెజ్‌తో పాటు ఆడి వంటి సం‍స్థలు ఇక్కడ లగ్జరీ కార్లు,  ఈవీ కార్ల మార్కెట్‌లో దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని తేల్చి చెబుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు