SEBI: నెలాఖరులోగా పాన్‌–ఆధార్‌ లింక్‌ చేసుకోవాలి

4 Sep, 2021 10:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ 30 నాటికి తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించుకోవాలని సెబీ కోరింది. తద్వారా లావాదేవీలు సాఫీగా నిర్వహించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. 

పాన్‌–ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని కేంద్ర సర్కారు ఎప్పటి నుంచో కోరుతోంది. కాకపోతే కరోనా వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 30 వరకు పాన్‌–ఆధార్‌ అనుసంధానానికి గడువు ఉంది. గడువులోపు లింక్‌ చేసుకోకపోతే పాన్‌ పనిచేయదు. పాన్‌ పనిచేయనప్పుడు కేవైసీ అసంపూర్ణంగా మారుతుంది. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు కేవైసీ తప్పనిసరి అని తెలిసిందే. 

దీంతో పాన్‌ బ్లాక్‌ చేయడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేని, కొత్తగా పెట్టుబడులు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ‘‘సెక్యూరిటీస్‌ మార్కెట్‌లో అన్ని లావాదేవీలకు పాన్‌ ఏకైక గుర్తింపు సంఖ్య. సీబీడీటీ నోటిఫికేషన్‌ నిబంధనలను సెబీ నమోదిత సంస్థలు అమలు చేయాలి. సెప్టెంబర్‌ 30 తర్వాత కొత్త ఖాతాల ప్రారంభానికి ఆపరేటివ్‌ పాన్‌నే అనుమతించాలి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది.

చదవండి: స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు 

మరిన్ని వార్తలు