మారుతి కార్లలో లోపాలు: రీప్లేస్‌ చేసేదాకా దయచేసి వాడకండి!

18 Jan, 2023 17:00 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, ముంబై:  భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. పలు మోడళ్ల కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లలో లోపం కారణంగా వేల కార్లను రీకాల్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 2022 డిసెంబరు 8, 2023 జనవరి 12 మధ్య తయారు చేసిన 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు  మారుతి బుధవారం తెలిపింది.ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో ,  గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ప్రభావితమైనట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో లోపం కారణంగా 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఈరోజు విడుదల చేసింది. ఈ వాహనాల్లో అవసరమైతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌ను ఉచితంగా తనిఖీ చేసి భర్తీ చేసేందుకు గాను ఈ రీకాల్ చేపట్టినట్టు వెల్లడించింది.  ఈ లోపం కారణంగా  వాహనం క్రాష్ అయినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్‌లు చాలా అరుదుగా పనిచేయకపోవచ్చని తెలిపింది.

ప్రభావితమైన భాగాన్ని మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని లేదా ఉపయోగించవద్దని వినియోగదారులకు సూచించింది. సంబంధిత  కార్‌ ఓనర్లకు తక్షణమే మారుతి సుజుకి అధీకృత వర్క్‌షాప్‌ల నుంచి సమాచారం వస్తుందని పేర్కొంది.  కాగా గత డిసెంబరులో సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా,ఎక్స్‌ఎల్‌ 6, గ్రాండ్ విటారా మోడల్స్‌ 9,125 యూనిట్లను ఫ్రంట్‌లైన్‌ సీట్ బెల్ట్‌లలోని లోపాలను సరిచేయడానికి రీకాల్ చేసింది.
 

మరిన్ని వార్తలు