మేఘాకు 12 ‘సిటీ గ్యాస్‌’ ఏరియాలు

29 Jan, 2022 05:50 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిటీ గ్యాస్‌ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టు 11వ రౌండు బిడ్డింగ్‌లో ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) 12 జాగ్రఫికల్‌ ఏరియాలను (జీఏ)దక్కించుకుంది. వీటిలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఏరియాలు ఉన్నాయి. పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ నియంత్రణ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) శుక్రవారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 65 జీఏలకు బిడ్స్‌ ఆహ్వానించగా 61 ఏరియాలకు బిడ్స్‌ వచ్చాయి. వీటిలో 52 ఏరియాల ఫలితాలను ప్రకటించారు.

ఎన్నికల కారణంగా 9 ప్రాంతాల ఫలితాలను ప్రకటించలేదు. వీటిల్లోనూ మరికొన్నింటిని ఎంఈఐఎల్‌ దక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణా విషయానికొస్తే జోగులాంబ గద్వాల్, నాగర్‌ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తిలో సీజీడీ ప్రాజెక్టులో భాగంగా సిటీ గేట్‌ స్టేషన్, గ్యాస్‌ సప్లై పైప్‌లైన్‌లు.. సిఎన్‌జీ స్టేషన్‌లను నిర్మించి, ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఇంటింటికీ గ్యాస్‌ సరఫరాకు సంబంధించి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైప్‌లైన్‌ నిర్మించడంతో పాటు 32 సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఐఎల్‌ పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాతో పాటు కర్ణాటకలో తుముకూరు, బెల్గావి జిల్లాల్లో మేఘా గ్యాస్‌ పేరిట గృహ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన గ్యాస్‌తో పాటు వాహనాలకు సీఎన్‌జీని కూడా అందిస్తున్నట్లు వివరించింది. 

మరిన్ని వార్తలు