గ్రామీణ మహిళలకు డిజిటల్‌ నైపుణ్యం

29 Oct, 2020 05:56 IST|Sakshi

మైక్రోసాఫ్ట్, ఎన్‌ఎస్‌డీసీ ఒప్పందం

లక్ష మందికి శిక్షణ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్రామీణ మహిళల ఉపాధికి అవసరమైన డిజిటల్‌ నైపుణ్యం కల్పించేందుకు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ నడుం బిగించింది. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 10 నెలల్లో దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది మహిళలకు డిజిటల్‌ నైపుణ్యం కల్పిస్తారు. డిజిటల్‌ అక్షరాస్యత, ఉపాధికి అవసరమైన నైపుణ్యం పెంపు, స్వయం ఉపాధి, సమాచార నైపుణ్యం వంటి అంశాల్లో 70 గంటలకుపైగా కోర్సు కంటెంట్‌ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

మైక్రోసాఫ్ట్‌ కమ్యూనిటీ ట్రైనింగ్‌ వేదికగా ఆన్‌లైన్‌లో లైవ్‌ క్లాసులు నిర్వహిస్తారు. తొలిసారి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న, అలాగే కోవిడ్‌–19 కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ యువతులు, మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి తెలిపారు. స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా ఒక లక్ష మంది యువతకు డిజిటల్‌ నైపుణ్యం కల్పించేందుకు ఇప్పటికే ఇరు సంస్థలు చేతులు కలిపాయి. కాగా, ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా 20,000 మంది యువతులను ఎంపిక చేసి ఎస్‌ఎస్‌డీసీ ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు