Microsoft CEO Satya Nadella: న్యూ బిజినెస్‌..! న్యూ అవతార్‌..!

8 Jan, 2022 20:35 IST|Sakshi

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కొత్త అవతారంతో కన్పించనున్నారు. బెంగుళూరుకు చెందిన మ్యూచువల్‌ ఫండ్స్‌ అండ్‌ స్టాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాంలో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్టర్‌గానే కాకుండా సదరు కంపెనీకి అడ్వైజర్‌గా కూడా పనిచేయనున్నారు. 

ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా..!
ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫిన్‌టెక్‌ సంస్థ  గ్రో (Groww) లో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్‌తో పాటుగా కంపెనీకి అడ్వైజర్‌గా కూడా పనిచేయనున్నారు. ఈ విషయాన్ని గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్‌ కేశ్రే శనివారం ట్విటర్‌లో వెల్లడించారు. ప్రపంచంలో అత్యుత్తమ సీఈవోల్లో ఒకరు గ్రోకు ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌లో ఆర్థికసేవల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న మా ఆశయంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని లలిత్‌ ట్వీట్‌ చేశారు. 

భారీ ఆదరణతో ‘గ్రో’త్‌..!
యువతను ఆకర్షించడంలో గ్రో విజయవంతమైంది. తక్కువ కాలంలోనే ఆయా ఇన్వెస్టర్ల నుంచి భారీగా పెట్టుబడులను గ్రో సమీకరించింది. గత ఏడాదిలో జరిగిన రెండు ఫండింగ్‌ రౌండ్లలో మొత్తంగా 251 డాలర్లను గ్రో సేకరించింది. దీంతో అక్టోబర్‌ 2021 నాటికి మూడు బిలియన్‌ డాలర్ల విలువ గల కంపెనీగా గ్రో అవతరించింది.

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో పాటుగా రాబిట్‌ క్యాపిటల్‌, సింఖోయా వై కాంబినేటర్‌, టైగర్‌ గ్లోబల్‌, ప్రొపెల్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌, ఐకానిక్‌ గ్రోత్‌, అల్కెన్‌, లోన్‌ పైన్‌క్యాపిటల్‌, స్టెడ్‌ఫాస్ట్‌ మొదలైనవి గ్రో(Groww)కు ఇన్వెస్టింగ్‌ పార్టనర్స్‌గా ఉన్నాయి. గతంలో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన లలిత్‌ కేశ్రే, హర్ష్‌ జైన్‌, నీరజ్‌ సింగ్‌, ఇషాన్‌ బన్సల్‌ 2018లో గ్రోని స్థాపించారు. దీనిలో సుమారు 20లక్షల మంది యూజర్లు ఉన్నారు.


చదవండి: బెంగళూరుకి ఝలక్‌ ! నియామకాల్లో హైదరాబాద్‌ టాప్‌

మరిన్ని వార్తలు